హైదరాబాద్ – హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు.
ఈరోజు సాయంత్రం ఉప్పల్ ఆర్వోబీని పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ ను కేటీఆర్, వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ఆయనేమన్నారంటే…కేటీఆర్ కు కండకావరం తలకెక్కింది. నేను హిందూ ధర్మం కోసం మాట్లాడితే మఠం పెట్టుకోవాలట… సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు… మీ అయ్య 24 గంటలు తాగి పండుకుంటున్నడు కదా… మీ అయ్యకు సీఎం పదవి ఎందుకు? బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే నీకు గిట్టదు కదా.. మసీదు పెట్టుకో.. నీకు రాజకీయాలెందుకు? రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారు. నేనడుగుతున్న. కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు… దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్.
ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం. మీ అరాచకాలను, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయే. కారు సర్వీసింగ్ కు పోయిందట… తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయింది. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయింది. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదు.కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలి. మేం రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివ్రుద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిల్ ప్రజల్లోకి తీసుకెళతాం…
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…రాసి పెట్టుకోండి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదు. ఏనాడూ ప్రజలను కలవలేదు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నడు.. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరు. అంటూ బండి పేర్కొన్నారు..
ఆగస్టులోపు ఉప్పల్ ఆర్వోబీని అందుబాటులోకి తేవాల్సిందే
జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో జాప్యానికి కోవిడ్, డిజైన్ మార్పుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ ఆర్వోబీ నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ సహకారం లోపించిందన్నారు. ప్రస్తుతం ఆయా సమస్యలన్ని అధిగమించి పనులు కొనసాగుతున్నాయని, వచ్చే ఆగస్టు నాటికి ఆర్వోబీ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
అప్పటిదాకా తాను నిద్రపోనని, అధికారులను నిద్రపోనీయనని అన్నారు. ఇకపై ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు.ఈరోజు సాయంత్రం ఉప్పల్ ఆర్వోబీ వద్దకు వచ్చిన బండి సంజయ్ పనుల పురోగతిని పరిశీలించాను. 2017లో ప్రారంభమైన ఆర్వోబీ పనులు 6 ఏళ్లు దాటినా ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. ఆర్వోబీ పనులన్ని పరిశీలిస్తూ.. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2017లో ప్రారంభమైన జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో తీవ్ర జాప్యానికి కారణం కోవిడ్, డిజైన్ మార్పే కారణమని అధికారులు చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని, రాష్ట్ర అధికారుల సహకారం కూడా లోపించిందని తెలిపారు. డిజైన్ మార్పు జరిగిన తరువాత అంచనాల విలువ పెరగడం, కాంట్రాక్టర్ మార్పుతో నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. రీ టెండర్ నిర్వహించి పనులు మొదలు పెట్టామని, ఆగస్టులోపు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతోపాటు అతి త్వరలోనే ఉప్పల్ రైల్వే స్టేషన్ ను కూడా సమగ్రంగా అభివ్రుద్ధి చేస్తామని, ఈ మేరకు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామని వెల్లడించారు
.అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఎన్నికల కోసం ఇక్కడికి రాలేదన్నారు. కరీంనగర్ ఆర్వోబీతోపాటు ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో పురోగతిపై ఇప్టపికే పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించానని తెలిపారు. రాబోయే ఆగస్టులోపు ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు హామీ ఇచ్చారు.కేంద్ర నిర్లక్ష్యంవల్లే ఆర్వోబీ నిర్మాణంలో జాప్యం జరిగిందంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ….10 ఏళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా?.. ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇది రాష్ట్ర, కేంద్ర భాగస్వామ్యంతో నిర్మిస్తున్నదే కదా… మరి ఎందుకు సహకరించడం లేదు? నీ మేధావితనం ఎందుకు పూర్తి చేయలేకపోయింది? నువ్వు పార్లమెంట్ లో మాట్లాడిన అని చెప్పినవ్ కదా… దేనికి ఉపయోగపడ్డది? కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సంపాదించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే నీ మాటలు ఉపయోగపడ్డాయి కానీ ప్రజలకు ఒరిగిందేమిటి? టిప్పర్ లో పట్టేనన్ని దరఖాస్తులిచ్చిన మేధావి.. ఒక్క పని కూడా ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు.