హైదరాబాద్ – సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్దభూమేనని అన్నారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశభక్తి, ఐక్యతను సినిమా ప్రేరేపిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. “సినిమావాళ్లు చేసేది పక్కా బిజినెస్. హీరోలు డబ్బులు పెడుతున్నారు.. ఆ తర్వాత సంపాదించుకుంటున్నారు. వాళ్లేమైనా సరిహద్దుల్లో సైనికుల వలే యుద్ధాలు చేస్తున్నారా?” అని నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు..
దేశభక్తి కేవలం సరిహద్దుల్లోనే కాదు, ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో కూడా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అనేక సినిమా పాటలు దేశాన్ని కదిలించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అల్లు అర్జున్ను కావాలనే అరెస్టు చేశారని, ఆయన విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఐకాన్ స్టార్ కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తేల్చి చెప్పారు. అలాగే దేశ భక్తి మూవీల క్లిప్స్ ను కూడా బండి పంచుకున్నారు..