శంకర్పల్లి ప్రభ న్యూస్ – గత కొన్ని రోజులుగా రోజుల నుండి వార్తలలో నిలుస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సరిహద్దులను , సర్వే నెంబర్లను పరిశీలించేందుకు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు.. బుల్కాపూర్ నాలా( ఫిరంగినాల) సర్వేలో భాగంగా జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో మంగళవారం కొలతలు తీసుకునేందుకు అధికారులు ఫామ్‌హౌజ్‌కు వచ్చారు.
ఇది ఇలా ఉంటే హైడ్రా ఏర్పడిన నేపథ్యంలో ఈ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి దీనిపై హైకోర్టు ను ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు చట్ట ప్రకారం ముందుకు పోవాలని ఆధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కొలతలు తీసుకుంటున్నట్లు సమాచారం
ఈ సర్వేకోసం శంకర్ పల్లి తాసిల్దార్ కార్యాలయానికి చెందిన సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ విభాగానికి చెందిన వర్క్ ఇన్స్పెక్టర్ వచ్చి నాలా స్థితిగతులను పరిశీలన జరుపుతున్నారు, బుల్కాపూర్ నాలా హద్దులు ఆక్రమణల విషయంలో ఇప్పుడే పూర్తి నిర్ధారణకు రాలేమని,, పై అధికారుల సూచనల మేరకు పూర్తి వివరాలు సేకరించి వారికి అందించనున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ తెలిపారు.