మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్థలు పీవీ తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా భూసంస్కరణలు అమలు కాగా.. వాటిని అమలు చేసిన గొప్ప సామ్యవాది, ప్రగతి శీలుడు పీవీ అని పొగిడారు. దేశంలో మొదటిసారి ప్రారంభించిన హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా ఆయన పెను మార్పులు తీసుకొచ్చారని భట్టి పేర్కొన్నారు. పీవీ పార్లమెంటు సభ్యుడు కాకపోయిన ఈ దేశాన్ని పాలించే అవకాశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయనకు కల్పించిందని అందుకు జాతీయ కాంగ్రెస్ కు కృతజ్ఞతలు తెలిపారు
బంగారం తాకట్టు పెట్టి అతలాకుతలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహనీయుడు, సరళీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పీవీ నరసింహారావు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావుతో పాటు ఎల్కే అద్వానీ, ఎమ్మెస్ స్వామినాథన్, కర్పూర సింగ్ ఠాకూర్, తదితరులకు భారతరత్న ప్రకటించడం గర్వించదగిన విషయం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.