Wednesday, November 20, 2024

TS: వానాకాలం సీజన్‌లో 70లక్షల ఎకరాల్లో పత్తిసాగు : మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు, 15 లక్షల ఎకరాలలో కంది సాగు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంటల కార్యాచరణ రూపొందించుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇందుకు అనుగుణంగా అందుబాటులో విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాలకు భూసారాన్ని పెంచే పచ్చి రొట్ట ఎరువులు పంపిణీతోపాటు మరో ఐదు లక్షల ఎకరాలకు పంపిణీకి సిద్ధం చేశామని తెలిపారు. బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్లు, తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైతేనే పంటలు విత్తుకోవడానికి సిద్ధం కావాలన్నారు.

తద్వారా విత్తనాలు నష్టంకావడం, మొలకశాతం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తప్పుతాయని ఆయన సూచించారు. రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. విత్తనాలను ఆధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవడంతో పాటు విత్తిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను భద్రపరచుకోవాలన్నారు. విత్తనాలలో నాణ్యత లోపిస్తే తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇవి తోడ్పడుతాయి. ఈ విషయంలో ఏమాత్రం సందేహాలున్నా క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలని కోరారు.

నకిలీ మిరపనారు ఎవరు అమ్మినా కఠినచర్యలు తప్పవు.. మిరపనారు సాగు చేసే నర్సరీలను ఉద్యాన అధికారులు తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైన మేరకు అందుబాటులో ఎరువులు, భాస్వరం అందించే కాంప్లెక్స్‌, డీఎపీ వంటి రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ఫాస్ఫో బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులు రైతులు విరివిగా ఉపయోగించాలన్నారు. మితిమీరిన రసాయన ఎరువులు ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యత లోపించడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయన్నారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఉన్నతాధికారులతో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లు సమీక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement