Friday, November 22, 2024

TG: అవినీతి, అక్రమాలకు సింగరేణిలో స్థానం లేదు… సీఎండీ బలరామ్

అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి
అన్ ఫిట్ చేయిస్తామని అక్రమాలకు పాల్పడే వారి సమాచారం ఇస్తే రూ.10వేల నజరానా
నాణ్యత పాటించని అధికారులు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీలపై కూడా కఠిన చర్యలు
విజిలెన్స్ విభాగంపై సమీక్షలో సంస్థ సీఎండీ ఎన్ బలరామ్ స్పష్టీకరణ


సింగరేణి భవన్, సెప్టెంబరు 18 (ప్రభ న్యూస్) : సింగరేణి సంస్థ పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికుల్ని మోసం చేస్తున్నారని తెలుస్తోందని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ హెచ్చరించారు. ఇప్పటికే మెడికల్ బోర్డు పేరిట అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ, నేర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించడం జరిగిందన్నారు..

ఇటీవల మెడికల్ బోర్డు ప్రక్రియలో దళారులపై సీఐడీ నివేదిక ఇచ్చిన తర్వాత, దీని ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మెడికల్ బోర్డు సహా కంపెనీకి నష్టం కలిగించే పనులు చేస్తున్న ఉద్యోగులు, ఇతరుల సమాచారాన్ని కంపెనీ విజిలెన్స్ విభాగానికి 9491144104 నెంబరులో లేదా [email protected] మెయిల్ కు ఆధారాలతో పంపించాలని సూచించారు. అక్రమార్కులపై కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు వారికి రూ.10 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

- Advertisement -

హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి బుధవారం విజిలెన్స్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు స్థానం లేదని, అక్రమార్కులపై విజిలెన్స్ శాఖ గట్టి నిఘాను ఉంచాలని, కార్మికులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవినీతిని అరికట్టడంలో సహకరించాలన్నారు. కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో సింగరేణి ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, ఇతరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అందజేసి అన్ ఫిట్ అవుతున్న వారికి కంపెనీ ద్వారా లభించే టర్మినల్ బెనిఫిట్స్ ను నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు. అనారోగ్య కారణాలతో బాధపడే వారి కోసమే కారుణ్య నియామక ప్రక్రియను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో ఏటా కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయి, వీటి నాణ్యతపైన కూడా విజిలెన్స్ నిఘాను పెట్టాలని సీఎండీ ఆదేశించారు. కాంట్రాక్టు పనుల్లో నాణ్యత పాటించని పక్షంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.

పకడ్బందీగా ఎక్స్ టర్నల్ పరీక్షల నిర్వహణ.. ఫలితాల విడుదల…
సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత ఉద్యోగ నియామక పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఇందులో 272 ఎక్స్ టర్నల్ పోస్టుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన 327 పోస్టుల ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.


సింగరేణి ఆస్తుల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు…
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, క్వార్టర్లను పరిరక్షించడం అందరి బాధ్యత అని సీఎండీ ఎన్.బలరామ్ చెప్పారు. దీన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్క ఉద్యోగి కృషి చేయాలన్నారు. సింగరేణి ఆస్తులు, క్వార్టర్ల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి జీఎం(విజిలెన్స్) ప్రసాదరావు, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement