కొత్తగూడెం మండలంలో ఇవాళ ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మంత్రి సీతక్కను కలిసి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు రమేష్ నాయక్ కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహబూబాబాద్ అతిపెద్ద గిరిజన జిల్లా అని, ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ జిల్లా కార్యాలయంలో జిల్లా అధికారితో పాటు దాదాపు పది సంవత్సరాల పాటు ఎటువంటి స్థానచలనం లేకుండా మర్రిచెట్టులా పాతుకుపోయిన అవినీతి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పిల్లల పొట్టలు కొడుతూ.. ప్రతి హాస్టల్ వార్డెన్ల నుండి 20శాతం కమీషన్లు తీసుకుంటూ, ఎస్టీలకు వచ్చే కార్పొరేషన్ నిధులు కానీ, అదేవిధంగా ఈఎస్ఎస్ స్కీం సీఎం ఎస్ టి ఈ ఐ స్కీం వాటిలో కూడా అర్హత లేని వారికి లోన్లు ఇవ్వడం జరిగిందని, వారిచే డబ్బులకు కక్కుర్తి పడి తన ఆదాయానికి మించిన ఆస్తిని సంపాదించుకోవడం జరిగిందన్నారు. పది సంవత్సరాల పాటు మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో పనిచేస్తూ మిగతా ఉద్యోగులపై హుకుం జారీ చేస్తున్నాడన్నారు. ఇతనికి జిల్లా అధికారి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడన్నారు.
ఈ జిల్లా అధికారి హాస్టల్లో వర్కర్ గా పనిచేస్తున్న ఉద్యోగిని దాదాపు రెండు సంవత్సరాలుగా తన సొంత కారు డ్రైవర్ గా వాడుకుంటున్నారన్నారు. ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. గత సంవత్సరం క్రితం దసరా పండగ సెలవు రోజు స్పెషల్ హాస్టల్లో విందులు చేస్తూ.. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతూ హాస్టల్లో ఉండే వస్తువులను ఉపయోగించుకుంటూ విందు భోజనాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను కోరినా కూడా ఫలితం లేకపోయిందన్నారు. ఈ సోమాని అనే ఉద్యోగిపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండి కూడా జిల్లా అధికారి అతనికి సర్వ అధికారాలు ఇచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడటానికి సహాయ సహకారాలు అందిస్తున్నాడన్నారు. ఇకనైనా మంత్రి సీతక్క దీనిపై స్పందించి.. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.
ఐటీడీఏ ద్వారా వచ్చిన భూములను గిరిజనులకు కేటాయించాలి…
మహబూబాబాద్ మండలం వీఎస్ లక్ష్మీపురం గ్రామం హజారియా తండాకు చెందిన లంబాడి కుటుంబాలకు 2008వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద వీఎస్ లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 260 లో ఎ 3.22 గుంటలు, 345/ఎ లో 6 ఎకరాల భూమిని ఎకరం రూ.60,000 చొప్పున మొత్తం 9.22 ఎకరాలకు ఐదు లక్షల 73 వేల రూపాయలు చెల్లించి పేద గిరిజన రైతులకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది… కానీ భూమి అమ్మిన రైతులు తన అంగ బలం, రాజకీయ బలం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతో ఆ భూమిని గిరిజన పేద లంబాడి రైతులకు అప్పజెప్పకుండా అతనే సాగు చేసుకుంటున్నాడన్నారు.
ఈ విషయంపై గత పది సంవత్సరాల పాటు జిల్లా కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు అవినీతికి పాల్పడి, వారిచే డబ్బులు తీసుకుంటూ తమను మోసం చేస్తున్నారు. తమ భూముల కోసం వెళ్తే.. తమపైన క్రిమినల్ కేసులు నమోదు చేపిస్తున్నారన్నారు. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కావున మంత్రి దీనిపై స్పందించి వెంటనే ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు కేటాయించిన భూములను గిరిజన లంబాడి కుటుంబాలకు స్వాధీన పరచాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి.. వెంటనే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నాయక్, సాయి నాయక్, బాధితులు, తదితరులు పాల్గొన్నారు.