హాజీపూర్, జనవరి 20 (ఆంధ్రప్రభ) : కార్పొరేషన్ వద్దు.. గ్రామమే ముద్దు.. అంటూ నర్సింగాపూర్ గ్రామస్తులు నిరసన తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామ ప్రజలకు తెలియకుండా కార్పొరేషన్ ఎలా ఏర్పాటు చేశారని గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించారు.
నర్సింగాపూర్ గ్రామం జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ ఆధారిత కూలీలతో కూడిన గ్రామమని, కార్పొరేషన్ వద్దని గ్రామపంచాయతీ కావాలని, గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయకుండా, ప్రజల తీర్మానం తీసుకోకుండా అధికారులు తీర్మానం చేసి నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వారు వాపోయారు.
గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో మీ ఊరు లిస్టులోనే లేదని తెలిపారని, ఇప్పుడు కార్పొరేషన్ లో ఎలా కలుపుతున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. పన్నులు కట్టే పరిస్థితిలో నర్సింగాపూర్ గ్రామ ప్రజలు లేరని, ఒకపూట చేసుకుంటే కానీ రెండో పూట గడవని బ్రతుకులని, మాకు కార్పొరేషన్ వద్దని గ్రామపంచాయతీ కావాలని గ్రామప్రజలు కోరారు. కలెక్టర్ వచ్చి కార్పొరేషన్ రద్దు చేస్తున్నామని చెప్పే వరకు నిరసన తెలియజేస్తామని జాతీయ రహదారి 63 పక్కన బైఠాయించారు.