హైదరాబాద్, ఆంధ్రప్రభ: విద్యను సేవా దృక్పథంతో చూడాల్సిన కొన్ని కార్పొరేట్ కాలేజీలు విద్యను వ్యాపారం చేసుకుంటున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులంటూ తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన ఇంటర్ బోర్డు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తోంది. నిబంధనలు గాలికొదిలేసి, విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కళాశాలలను గాడిలో పెట్టాల్సిన ఇంటర్ బోర్డు మొద్దునిద్ర పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడ్మిషన్లు, అనుమతులు, ఫీజుల అంశంలో ఏమాత్రం నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీల మాయలో బోర్డు పడిందనే ఆరోపణలున్నాయి. ఇంటర్ బోర్డును బురిడీకొట్టి కొన్ని కార్పొరేట్ కాలేజీలు యథేచ్చగా తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ఆకస్మిక తనిఖీలు చేసి ప్రైవేట్ విద్యను నియంత్రణ చేయాల్సిన అధికారులు కేవలం సాత్విక్ లాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కమిటీలని, నివేదికలనే పేరుతో హడావుడి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు తప్పితే, ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పకడ్బందీగా తనిఖీలు చేసి కార్పొరేట్ విద్యా మాఫియాను అరికట్టిందిలేనేలేదు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు, అనుమతులు లేకుండానే కళాశాలలు, అడ్మిషన్ల విధానం, హాస్టళ్లను నడిపే కళాశాలలపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాల గుర్తింపును రద్దు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ప్రజల నుంచి తీవ్రంగా వస్తోంది.
కళ్లు మూసుకుంటున్న బోర్డు…
కొన్ని విద్యాసంస్థలు నిబంధనలను పాతరేస్తున్నా ఇంటర్ బోర్డు కళ్లు మూసుకుంటోందని గతంలో ఓ సందర్భంలో అధికారుల పనితీరును హైకోర్టు తప్పుబట్టింది. సాక్షాత్తు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందంటే విద్యా వ్యాపారం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. రాష్ట్రంలోని ఏ ఒక్క జూనియర్ కాలేజీని పరిశీలించినా ఇది స్పష్టమవుతోంది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను వెతికిమరీ పట్టుకుని తమ కాలేజీల్లో చేర్చుకోవడం నుంచి ఈ వ్యాపారం మొదలవుతోంది. కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజులు భారీగా వసూలు చేసుకుంటూ కొన్ని కార్పోరేట్ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా సొమ్ము చేసుకుంటున్నాయి. కాలేజీల ప్రచారార్భాటాలతో ప్రభుత్వ కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న.. ఇంటర్ బోర్డు మాత్రం కళ్లుమూసుకునే ఉంటోంది. ఒక్కో గ్రూపులో నాలుగైదు సెక్షన్లు పెట్టి బాగా చదివే విద్యార్థుల పట్ల మాత్రమే యాజమాన్యం అధిక శ్రద్ధ తీసుకుంటూ ఇతర సెక్షన్ల వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఒక బ్రాంచీలో అడ్మిషన్ తీసుకొని వేరే బ్రాంచీలో సీట్లు ఇస్తున్నారు. బాగా చదివే విద్యార్థులకు ఒక సెక్షన్.. మీడియంగా చదివేవారిని, అంతంత మాత్రంగా చదివే వారిని వేరే వేరే సెక్షన్లలో కూర్చోబెట్టే మాయాజాలాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. వేలాది మంది ఆ కళాశాలలో చుదువుకోగా ఆయా సెక్షన్లలోని కొంత మంది విద్యార్థులకే ర్యాంకులు, మంచి మార్కులొస్తుండగా మిగిలిన విద్యార్థులు కేవలం పాస్‌కే పరిమితమవుతున్నారు. ఇదంతా ఇంటర్ బోర్డుకు తెలిసే ఏళ్ల తరబడిగా జరుగుతుందనేది విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో ఉండే కొంత మంది పెద్దల అండదండలను ఆసరాగా చేసుకొని బోర్డు అనుమతి ఇవ్వకపోయినా, ఏ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే కొన్ని కాలేజీలు నడస్తున్నట్లుగా సమాచారం. ఫైర్ ఎన్‌వోసి లేకుండానే చాలా కాలేజీలు నడుస్తున్నాయి.
ప్రతీ ఏడాదింతే…
ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర అనుమతులు లేవని దరఖాస్తులు తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసమంటూ గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1475 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మొదటగా 1010 కాలేజీలకు అధికారులు గుర్తింపునిచ్చారు. మరో 465 కాలేజీలకు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీలో ఉన్నట్లు ఇంటర్ బోర్డు గుర్తించి బహుళ అంతస్తుల భవనాల్లో నడిచే ఈ కాలేజీలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి లేకపోవడంతో గుర్తింపును నిలిపివేసింది. ఏమైందో ఆతర్వాత వీటికి కూడా అనుమతిచ్చేశారు. ఇలా జరగడం ప్రతి ఏడాది షరా మాములైంది. అఫిలియేషన్ రాకుండానే కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్ పేరు చెప్పి చివరిక్షణంలో కళాశాలలకు సరైనా ధ్రువపత్రాలు లేకుండాదనే గుర్తింపును ఇచ్చేస్తున్నారని ఆరోపణలున్నాయి. కార్పోరేట్ అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.