హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలను కరోనా మళ్లీ వణికిస్తున్నది. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో వరుసగా పెరుగుతున్న కేసులతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నెల వరకు 0.5 గా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు తాజాగా 2 శాతంగా నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో టెస్టులు చేయించుకుంటున్న ప్రతీ వంద మందిలో నలుగురైదుగురికి పాజిటివ్‌గా వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన వైద్య,ఆరోగ్య శాఖ కరోనా కట్టడికి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది.
టెస్ట్, ట్ర్రేస్, ట్రీట్ పద్దతులను పాటించి కరోనా మహమ్మారిని నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారం రోజుల పాటు కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించి ఆ తరువాత రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్ర్రాలతొ కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్ వరుసగా రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ డా. గడల శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు.
కరోనాపై అన్ని జిల్లాలలో క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశామనీ, ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు జిల్లాలలో కొంత వైరస్ ప్రభావం కనిపిస్తున్నదనీ, దీనిని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీంతో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారకముందే కరొనా కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
కేసుల సంఖ్య పెరగడం, తగ్గడం సహజమే : డీహెచ్ డా.గడల శ్రీనివాసరావు
రాష్ట్ర్రంలో ఈనెల మొదటి రెండు వారాల్లో పెరిగాయనీ, అయినప్పటికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీహెచ్ డా.గడల శ్రీనివాసరావు అన్నారు. కేసుల సంఖ్య సహజంగానే పెరగడం, తగ్గడం ఉంటుందనీ, అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు టెస్ట్, ట్రేస్, ట్రీట్ పద్దతిని అవలంబిస్తూ కేసుల తీవ్రత పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. పాజిటివిటీ రేటు ఒక్క శాతం కంటే ఎక్కువ ఉన్న జిల్లాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు గతంలో కరోనా సమయంలో పాటించిన విధంగా మాస్కులు ధరించడం, జన సమ్మర్థం ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా తిరగకపోవడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు. జలుబు, జ్వరం, దగ్గు, వంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని డీహెచ్ డా.శ్రీనివాసరావు స్పష్టం చేశారు.