హైదరాబాద్ – అల్పపీడనం ప్రభావం హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఇక, హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం నుంచి ముసురేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది.
దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో కురుస్తూ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సికింద్రాబాద్, తిరుమలగిరి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బోరబండ, కూకట్‌పల్లి, బాచుపల్లి, తార్నాక, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, తదితర ప్రాంతాల్లో కురిcన వర్షంతో బయటికి వచ్చిన నగరవాసులు తడిసిముద్దయ్యారు.
వర్షం, ముసురుతో నగరంలో చలి తీవ్రత కూడా భారీగా పెరిగింది. దీంతో జనం తమ నివాసాలకే పరిమితమవుతున్నారు..
నేటి ఉదయం హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంచుతెరలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.
అల్వాల్, చిలకలగూడ, జవహర్ నగర్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వర్షం కురిసింది. అటు యాదాద్రిలోనూ రోజంతా తేలికపాటిజల్లులు కురుస్తూనే ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి కూడా పలు చోట్ల వాన పడింది. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా కనిపిస్తోంది. ఉత్తర, ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇది ఇలావుండగా, బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలహీనంగా మారిందని పేర్కొంది. దీని ప్రభావంతో 1.5 కిలో మీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది