హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో బీటెక్ ఫీజులు వచ్చే బ్లాక్ పిరియడ్‌కు(2022-25) సంబంధించి పెరగనున్నాయి. అయితే ఎంత పెరుగుతాయనేది త్వరలోనే స్పష్టత వచ్చే రానుంది. ఈనెల 7 నుంచి 20 వరకు 145 ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఫీజుల పెంపు అంశంపై సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. రోజూవారిగా కొన్ని కాలేజీలతో కమిటీ వారి వారి అభిప్రాయాలను వింటోంది. అయితే వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు 2022-25 ఇంజనీరింగ్ ఫీజులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎంత పెరుగుతాయనేది ఈనెల 20 తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం గత మూడేళ్లలో ఖర్చులు బాగా పెరగడం, కరోనా కారణంగా నష్టపోవడంతో వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులను పెంచాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 25 నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచాలని కొన్ని కాలేజీలు పట్టబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజు పెంపు అంశంపై టీఏఎఫ్‌ఆర్‌సీ తర్జనభర్జనలు పడుతోంది. కళాశాల ఆదాయ, వ్యయాలు, మౌలికవసతుల కల్పన, ఫ్యాకల్టిdకి ఇచ్చే జీతాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా కళాశాలలు ఇచ్చే అడిట్ నివేదికను బట్టి ఫీజులను పెంచడం చేస్తుంటారు. ఈక్రమంలోనే వచ్చే మూడేళ్లకు ఎంత మేర ఫీజులను పెంచాలనే దానిపై టీఏఎఫ్‌ఆర్‌సీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. 2019 బ్లాక్‌పిరియడ్ (2022 వరకు)లో పెంచిన ఫీజుల గడువు ముగిసింది. దాంతో 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2023-24, 2024-25 వరకు కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఫీజుల పెంపుపై కమిటీ కసరత్తు చేస్తోంది.
ఫీజుల పెంపుపై ఒత్తిడి!
ప్రస్తుతం తెలంగాణలో 158 వరకు ప్రైవేట్ కాలేజీలుంటే, అందులో రూ.35వేలు కనీస ఫీజు ఉన్న కాలేజీలు 20, రూ.80వేల వరకు ఫీజు ఉన్న కాలేజీలు 110, మిగతా కాలేజీల్లో గరిష్టంగా రూ.1.34 లక్షల వరకు ఫీజు ఉంది. ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యామండలి) మాత్రం ఈ ఏడాది నుంచి ఇంజనీరింగ్ కనీస ఫీజు రూ.79,600, గరిష్ట ఫీజు రూ.1,89,800 వరకు పెంచాలని రాష్ట్రాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఏఐసీటీఈ సూచించిన ఫీజులనే అమలు చేయాలని పలు కాలేజీలు టీఏఎఫ్‌ఆర్‌సీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీటీఈ సూచించిన సిఫార్సులను అమలు చేయాలని అంటున్నాయి. ప్రతి సారి 10 నుంచి 15 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా 25 నుంచి 50 శాతం పెంచాలని చేస్తున్న కాలేజీల డిమాండ్‌ను కమిటీ ఆమోదించే అవకాశం లేదు. విద్యార్థులు, ప్రభుత్వం భారం పడకుండా ఉండేలా ఫీజుల పెంపుపై టీఏఎఫ్‌ఆర్‌సీ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోనుంది.
ప్రభుత్వంపై భారం పడకుండా!…
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బీటెక్ ఫీజులు కచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఒకవేళ ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే అంశాలను బేరీజు వేసుకొని ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రస్తుతం అమలవుతోంది. అలాగే ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు వచ్చినా రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఆపైన ర్యాంకు ఉంటే బీసీ, ఓసీలు ఎవరికైనా కాలేజీ ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే ఫీరీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వంపై ఫీరీయింబర్స్‌మెంట్ భారం పడుతోంది. ఒకవేళ 2022-25 వరకు ఫీజులు పెరిగితే ప్రభుత్వంపై ప్రతి ఏటా సుమారు 20 కోట్ల నుంచి 40 కోట్ల వరకు భారం పడుతోందని అంచనా.
అలాగే 10వేలకుపైన ర్యాంకు వచ్చిన విద్యార్థులపై కూడా భారం పడనుంది. భారీగా ఫీజులు పెంచాలనే కాలేజీల డిమాండ్‌ను ప్రభుత్వం సైతం అంగీకరించే అవకాశం లేదని విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఫీజు పెంపు 25 శాతంలోపే ఉండేలా టీఏఎఫ్‌ఆర్‌సీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని కళాశాలల యాజమాన్యాలను ఒప్పించే ప్రయత్నాన్ని టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అడిట్ నివేదిక సమర్పించిన 145 కాలేజీల్లో ఇప్పటి వరకు 106 కాలేజీలతో టీఏఎఫ్‌ఆర్‌సీ సంప్రదింపులు జరిపింది. ఈనెల 18, 19, 20వ తేదీల్లో మిగిలిన 39 కాలేజీలతో సంప్రదింపులు జరపనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.