కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, పెన్షన్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. నిధులు ఆపలేదని, కరోనాలో కూడా ఈ పథకాలు కొనసాగించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యదర్శతకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పింక్ ప్యాలెస్ లో షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. 201 మంది లబ్ధిదారులకు సంభందించి 2 కోట్ల పై చిలుకు నిధులకు చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. మూడేళ్ల కాలంలోనే 3480 మంది లబ్ధిదారులకు 34 కోట్ల 84 లక్షలు, ఈ పథకం కింద ఒక్క బాలాపూర్ మండలంలోనే అందించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరపున నూతన జంటలకు అభినందనలు తెలిపారు. మీ అందరికీ మేన మామ లాగా ముఖ్యమంత్రి షాది ముబారక్ ద్వారా సహాయం అందిస్తున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఈ పథకంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కు సంబంధించి ఫైల్స్ ను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు.
కేసీఆర్ కిట్లతో ప్రైవేట్ ఆస్పత్రుల బాధలు తగ్గాయన్నారు. ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయిలు పుడితే రూ.12 వేలు ఇస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు పెరిగాయన్నారు. త్రాగునీటి కోసం నూతన పైప్ లైన్లు తదితర వాటి కోసం నియోజకవర్గానికి రూ.210 కోట్ల నిధులు వస్తే, అందులో జల్ పల్లి మునిసిపాలిటీకి రూ.30కోట్లు వచ్చాయన్నారు. జల్ పల్లి మునిసిపాలిటీలో మిగిలి పోయిన పనులన్నీ పూర్తి అయితే ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందుతుందన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.