హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్ల సర్వీసులను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యాసంవత్సరం జూన్ 15 నుండే వీరి విధులను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 1654 మందికి ప్రయోజనం కలిగినట్లయ్యింది. ఈ విద్యా సంవత్సరంలో వీరికి రెన్యూవల్ చేయనప్పటికీ కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచే విధుల్లోకి వెళ్తున్నారు. తమను రెన్యూవల్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులను పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో తాజాగా అతిథి అధ్యాపకులను విధులను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ కాలేజీల గస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. జూన్ 15 నుండే కొనసాగిస్తూ తమను ఆదుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రులు సబిత, హరీష్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సిరెడ్డి, విద్యాశాఖ అధికారులకు వారు గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.