హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టిdని విధుల్లోకి తీసుకోనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నా 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టిd (అతిథి అధ్యాపకులు)ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఇంర్మీడియట్ విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.
కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను ఏ విధంగా తొలగిస్తారని పలువురు అతిథి అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించడంతో పాతవారినే తీసుకోవాలంటూ ఈనెల 21 హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే ఫ్యాకల్టి లేని చోట నిబంధనల మేరకు కొత్తవారిని తీసుకోవాలని జిల్లా అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇంటర్ బోర్డు ముందు ఆందోళనలు…
పాతవారినే తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసినా ఇంటర్ విద్యా కమిషనర్ పట్టించుకోవడంలేదంటూ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షులు పి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముందు మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వందలాది మంది అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1654 మంది అతిథి అధ్యాపకులను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలను కోర్టు ఇచ్చినా ఇంటర్ విద్యా కమిషనర్ బేఖాతరు చేశారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల జీతానికి బదులుగా పన్నెండు నెలల జీతాలు చెల్లించాలని కోరారు. ప్రతీ పిరియడ్‌కు చెల్లించే రూ.390 కాకుండా ప్రతి నెల రూ.28,080 చెల్లిస్తామని సీఎం ప్రకటించిన హామీను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.