Monday, November 25, 2024

NZB: రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడాలి… షబ్బీర్ అలీ

బిక్కనూర్, అక్టోబర్ 5, ప్రభ న్యూస్ : రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీ పాలకవర్గం నిరంతరం పాటు పడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. శనివారం బిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ పాతరాజు, వైస్ చైర్మన్ టెంట్ హౌస్ స్వామితో పాటు పాలకవర్గ సభ్యుల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. వాటిని రైతులకు అందించే విధంగా పాలకవర్గం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

కామారెడ్డి జిల్లాలో ఆదర్శ మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మార్కెట్ కమిటీలో అన్నిరకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇందుకోసం ఎలాంటి సమస్యలున్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులను ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. రెండు లక్షల లోపు రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రెండు లక్షలకుపైన ఉన్న రైతుల రుణమాఫీ త్వరలోనే చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని అన్నారు. పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం నిజమైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కర్ మాట్లాడుతూ… ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి మోసం చేశారని ఆరోపించారు. అన్నివర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 కు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

- Advertisement -

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలన్నారు. అనంతరం నూతనంగా ఏర్పడిన పాలకవర్గాన్ని వారు శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బీబీ పేట, రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, తిరుపతిరెడ్డి, రమేష్, యాదవ రెడ్డి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, మాజీ జడ్పిటిసి తిరుమల గౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు లింగాల కిష్ట గౌడ్, సిద్ధి రాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement