కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు గురువారం బహిరంగ లేఖ రాశారు.
పాలమూరు జిల్లా ప్రజల కన్నీటి గాథలు అంతాఇంతా కాదన్నారు. రాజకీయ పునర్జన్మనిచ్చిన మహబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఆరోపించారు. పాలమూరు అంటే కేసీఆర్‌కు నచ్చదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి… కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల కృష్ణా నీటి వాటాలో మనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టిందన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటన అంటున్నారని ధ్వజమెత్తారు. రేపు తాము నిర్వహించనున్న చలో పాలమూరు కార్యక్రమంలో బీఆర్ఎస్ బండారం బయటపెడతామని హెచ్చరించారు.