అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిబిడ్డలకు అండగా నిలిచింది. యవ్వన దశలోనే పేదల బతుకులు బాగు చేయాలని అడవిలోంచి అడవిలోకి బైలెల్లింది. తుపాకీ చేతపట్టి పేదల కోసం పోరుచేసింది. కామ్రేడ్ సీతక్క అంటే ఏజెన్సీ ప్రాంతంలో తెలియని పల్లె లేదు.. ఆమెను ఎరుగని గూడెమూ ఉండదు.. అట్లాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీ ఆ తర్వాత తన పంథా మార్చుకుంది. తుపాకీ వదిలేసి జనజీవనంలోకి వచ్చి జైల్లోనే పెద్ద చదువులు చదివింది. తాను నేర్చుకున్న అక్షరాలే ప్రజాస్వామ్య విధానంలో ఉన్నత స్థితికి చేర్చాయి. ఇదే విషయాన్ని అడవి బిడ్డలకు నేర్పించే పనిలో మరో ముందడుగు వేసింది. అందరిలో సమానత్వం తీసుకొచ్చే మరో ఉద్యమానికి అడుగులు పడ్డాయి. చదువుకోవడానికి సౌకర్యాలు లేని మారుమూల గిరిజన గూడాల్లోకి ప్రి ఫ్యాబ్రికేటెడ్ పాఠశాలలు వస్తున్నాయి. తొలి కంటైనర్ స్కూల్‌ని బంగారుపల్లిగూడెంలో ప్రారంభించగా.. మంత్రి సీతక్క ఇంగ్లిషు పాఠాలు చెప్పి టీచర్‌గా మారారు.
మారుమూల గ్రామంలో బోధనా వసతులు
రాష్ట్రంలోనే తొలి కంటైనర్ స్కూల్ ప్రారంభం
బంగారుపల్లి గూడెం పిల్లలకు ప్రి ఫ్యాబ్రికేటెడ్ పాఠశాల
మంత్రి సీతక్క చొరవకు గిరిజనులు ఖుషీ
పట్టరాని ఆనందంలో గుత్తికోయ చిన్నారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, కన్నాయిగూడ (ములుగు జిల్లా) : అదో మారుమూల అటవీ ప్రాంతం కన్నాయిగూడంలోని బంగారుపల్లి గూడెం… విద్యార్థులంతా గుత్తికోయ తెగకు చెందిన వారు. ఆ గ్రామానికి అధికారులు, మంత్రులు వెళ్లడం చాలా అరుదు.. అయితే.. ఓ మహిళా మంత్రి.. అడవిబిడ్డలకు ఇంగ్లిషు పాఠాలు బోధించడం వారిలో పట్టరాని సంతోషాన్ని కలిగించింది. చుట్టు ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు.. అక్కడున్న ఉపాధ్యాయులు ఆమె బోధనలకు ముగ్ధులయ్యారు. టీచర్‌గా అవతరమెత్తిన ఆ మంత్రి ఎవరో కాదు.. పంచాయతీరాజ్, మహిళ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క..
ఏబీసీడీలతో ప్రారంభించిన బోధన..
బంగారుపల్లి గూడెంలో కంటైనర్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క లోపలకు వెళ్లి ఆదివాసీ పిల్లలకు బెంచీల మీద కూర్చోమన్నారు. ఆ తర్వాత బోర్డు మీద సుద్ధముక్కతో ఏబీసీడీలు రాశారు. తనదైన శైలి నవ్వుతూ ఇవి ఏమిటో టీచర్ చెప్పారా అంటూ ఏబీసీడీ అని చెబుతూ బోధించారు. కాసేపు పిల్లలకు బోధిస్తూ ఆనందం పొందారు.
పాఠశాల ప్రారంభం
రూ.13 లక్షలతో నిర్మించిన కంటైనర్ స్కూల్ ( ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పాఠశాల)ను మంగళవారం సాయంత్రం ఆమె ప్రారభించారు. శాశ్వత భవనాలు నిర్మించడానికి అవకాశం లేని ప్రాంతాల్లో ఇలాంటి కంటైనర్ పాఠశాలను నిర్మిస్తామన్నారు. ఈ పాఠశాలకు 20 సంవత్సరాల వారంటీ కూడా ఉందని చెప్పారు. మరో రెండు గ్రామాల్లో కంటైనర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక వేళ శాశ్వత భవనాలు నిర్మిస్తే ఆ మెటీరియల్ ఇంకో చోటకు తరలించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గం టీచర్స్ శాసన మండలి సభ్యులు నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. లు పాల్గొన్నారు.
ఆదివాసీలకు నాణ్యమైన విద్య
దట్టమైన అడవి ప్రాంతాల్లోని, ఆదివాసీ గ్రామాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ నిబంధనలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయలేకపోతున్నామని, దీంతో ఎలాగైనా గిరిజన బిడ్డలకు విద్యను అందించాలని ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత పది సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని, వందలాది ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.