హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ పనులు దసరా లోగా పూర్తి కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులలో వేగం పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తరువాత పెద్ద నగరమైన వరంగల్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా ఈ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 24 అంతస్తులతో రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2000 పడకల సామర్థ్యం కలిగి ఉండే ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో సీఎం కేసీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ మల్టి స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే మెడికల్ హబ్‌గా మారనుంది.
అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తిం చెందే అవకాశం లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లను ఇందులో ఏర్పాటు చేయనున్నారు. తాజాగా బుధవారం వరంగల్ హెల్త్ సిటీపై సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్‌రావు పనులు మరింత వేగవంతం చేసి దసరా లోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ తరఫున అన్ని పనులు పూర్తి చేశామనీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లిలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌లలో వైద్య సేవలు ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఆస్పత్రులలో కూడా అత్యాధునిక సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఎల్బీనగర్, అల్వాల్, సనత్‌నగర్‌లలో నిర్మాణం ఉన్న ఒక్కోటి 1000 పడకల సామర్థ్యంతో ఉండే ఈ ఆస్పత్రులలో వైద్య సేవలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
ఇక ఈ ఏడాది ప్రారంభం కానున్న 8 టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణం పనులు సైతం వేగంగా సాగేందుకు వీలుగా వీటికి సంబంధించిన డిజైన్లను రూపొందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులు సెప్టెంబర్‌లోగా పూర్తయి దసరా వరకు వైద్య సేవలు అందుబాటులోకి రానుండగా, 3 టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణం, 8 టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణంతో రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య చేరువ కానుంది.