Friday, November 22, 2024

Follow up : ఉజ్వల భారత్‌ నిర్మాణం, కార్యాచరణ షురువైంది.. దుష్టశక్తులను తరిమికొట్టాలే : సీఎం కేసీఆర్‌

వికారాబాద్‌,ప్రభన్యూస్‌ ప్రతినిధి: కేంద్రంలోని బిజేపి నేతృత్వంలో ఉన్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వంను గద్దెదించేందుకు ప్రజలు చైతన్యం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమంను పక్కన పెట్టి బడా వ్యాపారులకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న మేరకు వివిధ రంగాల వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తే ఉచితం పేరుతో వాటిని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రు చేస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చప్పగా ఉందని అన్నారు. తలకు రుమాలు కట్టుకోవడం తప్ప కొత్తదనం ఏమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆక్షేపించారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బిజేపి నేతలపై కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రం ప్రభుత్వంను ఓడించి అక్కడ ప్రజల ప్రభుత్వంను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉజ్వల భారత్‌ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా కార్యాచరణ మొదలెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈసారి ప్రజలు మోసపోతే గోస తప్పదని హెచ్చరించారు. ప్రజలు గ్రామాలలో చర్చ పెట్టి జరుగుతున్న విషయాలను చర్చించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. అన్ని రంగాలలో అగ్రగామిగా ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రంను ఆగం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. తెలంగాణ గుంట నక్కలు.. స్వార్థశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు నిచ్చారు.

తెలంగాణ ఊరికే రాలేదని.. 14 ఏళ్ల పాటు పోరాటం చేసి మరణం అంచు వరకు వెళ్లి సాధించుకున్నామని గుర్తుచేశారు. అలాంటి తెలంగాణ స్వార్థ రాజకీయాలకు బలికాకుండా ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాడు.. మనంను చూసి నవ్విన వారు..ఇప్పుడు అడ్డం పొడువు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను నేను సాధించాను.. ప్రజలు అధికారం ఇవ్వడంతో ప్రతి ఇంటికి తాగునీరు, ఉచిత కరెంటు, సంక్షేమ పథకాలను..గురుకుల పాఠశాలలను అమలు చేసుకుంటున్నామని గుర్తుచేశారు. తెలంగాణ పారిశ్రామికంగా.. ఐటి రంగంలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉందని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ అయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వాటిని ఉచితంగా పేర్కొంటోందని.. వాటిని రద్దు చేసే కుట్రకు కేంద్ర ప్రభుత్వం తెరలేపిందని ముఖ్యమంత్రి అన్నారు. నష్టం జరగకముందే ప్రజలు మేల్కొనాలని సూచించారు. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రధాని మోదీ ఏం సాధించారని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఏ వర్గంకు..ఏ రంగంకు న్యాయం చేశారని నిలదీశారు.

బిజేపి జెండాలను చూసి మోసపోతే బాయికాడ మీటర్లు పెడుతారు.. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటరు పెడుతారు.. మెడపై కత్తి పెట్టి బిల్లులు వసూలు చేస్తారనిపేర్కొన్నారు. పేదలను కొట్టి షావుకార్ల కడుపు నింపుతారని అన్నారు. కరెంటు ఫ్రీగా రావాలంటే..ఇంటింటికి మంచి నీరు రావాలంటే ప్రజలు ఏ జెండా పట్టుకోవాలో ఆలోచించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. దేశంలో పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని.. గ్రామాలలో ప్రజలు చర్చ పెట్టుకొని జరుగుతున్న పరిణామాలపై లోతుగా చర్చ పెట్టాలని పేర్కొన్నారు. పొరుగున కర్ణాటకలో ఉన్నది బిజేపి ప్రభుత్వం కదా..అక్కడ పించన్‌ ఎంత ఇస్తున్నారు.. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ఎందుకు అమలు కావడం లేదని..ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వికారాబాద్‌ ప్రాంతంకు క్రిష్ణా నీటిని తీసుకవచ్చి పారించే పని ఒక్కటే బాకి ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. పాలమూరు..రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను ప్రారంభించామని.. దానిని కూడా కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. క్రిష్ణా నీటిలో వాటాలు తేల్చాలని గత 8 ఏళ్లుగా అడుగుతున్నా..తాత్సారం చేస్తున్నారని..అయినా ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు క్రిష్ణా నీటిని తీసుకవస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ సభలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఆర్‌ అండ్‌ బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవీ, మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఆనంద్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement