మెండోర, మార్చ్ 30 (ప్రభ న్యూస్) : దేశంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త టెక్నాలజీతో వంతెన నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలంలోని పోచంపాడ్ లో పోచంపాడ్, సోన్ పేట్ గ్రామాల మధ్య నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో తెలంగాణలోని నీటి ప్రాజెక్టులన్నీ అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు శివాలయాలుగా ఉన్న ప్రాజెక్టులు ప్రస్తుతం వైష్ణవాలయాలుగా మారుతున్నాయన్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలోని ప్రాజెక్టులు అభివృద్ధి చెందడమేనన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా ప్రాజెక్టుకు పూర్వకలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. కాకతీయ కాలువ వంతెనపై దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త టెక్నాలజీతో వంతెన నిర్మిస్తున్నామన్నారు.
రూ.1.38 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ స్వయంగా మంజూరు చేశారన్నారు. వంతెన నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులు నిండుకుండలా ఉంటున్నాయన్నారు. కాకతీయ కాలువ ద్వారా నిరంతరం నీటి విడుదల చేపట్టడం వలన కాలువపై వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ప్రస్తుతం నీరు ప్రవహించినా ఇబ్బంది లేకుండా కొత్త టెక్నాలజీతో వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రెండు గ్రామాల మధ్య కాకతీయ కాలువపై రవాణా ఇబ్బంది లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బురుకల సుకన్య కమలాకర్, జడ్పీటీసీ సభ్యుడు తలారి గంగాధర్, సర్పంచులు మిస్బావోద్దిన్, గోలి ప్రకాష్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ నవీన్ గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు జాన్ బాబు, కో ఆప్షన్ సభ్యుడు బాబా, ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాంగంపేట శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.