Tuesday, November 26, 2024

బీసీలు గర్వించేలా ఆత్మగౌరవ భవనాలు

ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే కట్టిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో బిసి కులాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అన్ని కుల సంఘాలు రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహించామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఎంతో ముఖ్యమంత్రులు, మంత్రులు మారారని అన్నారు. రాష్ట్రంలో 282 గురుకులాలు స్థాపించి లక్షకు పై చిలుకు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు కూలీ పనులు చేసినా.. పిల్లలు లక్షల విలువ చేసే చదువు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చదువుతున్నారని చెప్పారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఒక్క గుంట భూమి ఆత్మగౌరవ భవనాలు కావాలి అంటే ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు నగరం నడిబొడ్డున లక్షల విలువ చేసే భూమి ఇచ్చారని చెప్పారు. ఆత్మగౌరవ భవనాలు ప్రభుత్వం ప్రభుత్వమే కట్టిస్తుందన్నారు. సంఘాలు అన్ని కలిసి ఒక్క ట్రస్ట్ గా ఏర్పడితే ప్రభుత్వం భూమి ఇస్తుందని వివరించారు. అన్ని బిసి సంఘాలు ట్రస్ట్ గా ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. కుల వృత్తుల వారిగా భవనాలు ఉండాలి కాబట్టి అలానే ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరి మాసంలో 41 కుల సంఘాలు ఆత్మగౌరవ భవనాలు ప్రారంభిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా ఇక్కడ బిసిలకు ఆత్మగౌరవ భవనాలు కట్టిస్తామన్నారు. ఈనెల 17వ తేదీ లోపు తీర్మానాలు పంపాలన్నారు.

ఆత్మగౌవర భవనాల కోసం 4 వేల కోట్ల విలువైన భూమిని బిసిలకు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2 నెలలో పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. గతంలో బీసీలను రాజకీయంగా వాడుకున్నారు తప్ప.. కులాలకు ఏం చేయాలని ఆలోచన చేయలేదన్నారు. ఆనాటి ప్రభుత్వాలు బిసిలను అజ్ఞానులుగా చూశారన్నారు. బిసి కులాలకు హాస్టల్ లు, చదువుకోవడం కోసం గురుకులాలు లేవన్నారు. అసెంబ్లీలో బిసి కుల గణన కోసమే తీర్మానం చేస్తే ఇప్పటివరకు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటివరకు కూడా చాలా బిసి కులాల్లో సర్పంచ్ లు కుడా కాలేదన్నారు. చదువులు చదివితేనే బతుకులు బాగుపడుతాయి అని చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో 1000 పైగా గురుకుల పాఠశాలు ఏర్పాటు చేశామన్నారు.  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బిసిలు గర్వించదగ్గ భవనాలు నిర్మించి ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement