Friday, November 22, 2024

Minister : విద్యుత్ రాయితీల ఎత్తివేతకు కుట్ర… కాంగ్రెస్ ను తరిమికొట్టాలన్న జగదీష్

విద్యుత్ రాయితీల ఎత్తివేతకు కుట్ర పన్నుతొన్న కాంగ్రెస్ ను తరిమికొట్టాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో ఉన్న శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్‌, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. గతంలో వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నాడని, ఆయన వారసత్వాన్ని రేవంత్‌ రెడ్డి కొనసాగిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్‌ నేతలు శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయని రేవంత్‌ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. 2004 పరిస్థితులను 20 ఏండ్ల తర్వాత గుర్తుకుతెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఆరు గంటలు కరెంటు ఇస్తే రేవంత్ తదితర టీడీపీ నేతలే ధర్నాలు చేశారని గుర్తుచేశారు. మీ ఇంట్లో 24 గంటలు కరెంటు ఎందుకు ఉండాలి.. రైతులకు మాత్రం 24 గంటలు ఇవ్వోద్దా అని ప్రశ్నించారు. రైతులంటే కాంగ్రెస్‌కు ఇంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడి దారులకు 24 గంటల కరెంట్ ఉండాలి.. రైతులకు ఎందుకు ఉండకూడదని నిలదీశారు. ఎప్పుడంటే అపుడు కరెంట్ ఆన్ చేసుకునే వెసలు బాటు రైతులకు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చేయాలని నిర్ణయించారని చెప్పారు.

పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతులకు పాము, తేలు కాట్లే గతన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడారు.. కాబట్టి కాంగ్రెస్ తప్పించుకునే అవకాశం లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి చెప్పారు. మూడు గంటల ఉచిత కరెంటు సరిపోతుందని అవగాహన లేనివాళ్లే మాట్లాడతారన్నారు. కాంగ్రెస్ తీరుపై రేపు రైతులతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది రద్దుల బతుకని.. ఉచిత విద్యుత్‌ను రద్దుచేస్తామని రేవంత్ అంటే, యాదాద్రి ప్లాంటును క్యాన్సల్‌ చేస్తామని ఎంపీ కోమటి రెడ్డి అంటున్నాడని విమర్శించారు.

- Advertisement -

రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌పై మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగానికి అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి లభిస్తున్న తరుణంలో రేవంత్ రూపంలో కొత్త భాదవచ్చిపడిందన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏమిటో ఆయన వ్యాఖ్యలతో బయట పడిందని చెప్పారు. గతంలో ఆ పార్టీ రైతులకు ఏడు గంటల కూడా కరెంటు ఇవ్వలేక పోయిందని విమర్శించారు. అసలు పీసీసీ చీఫ్‌కు వ్యవసాయంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఎకరా పారాలంటే గంట విద్యుత్ చాలట అని ఎద్దేవాచేశారు. ఇక కాంగ్రెస్ జెండా పట్టుకున్న రైతులు ఆలోచించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement