Sunday, November 17, 2024

ప్రశ్నించే గొంతుకపై కుట్ర.. నామినేషన్లు వేసిన వారికి బెదిరింపులు: ఈట‌ల

ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభ న్యూస్): తెలంగాణలో ప్రశ్నించే గొంతు లేకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేందర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కంది శివారులో బిజెపి శిక్షణ తరగతులకు ముఖ్య అతిధిగా హాజరైన ఈట‌ల మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన వాక్ స్వాతంత్రం తెలంగాణలో లేకుండా చూడాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నాడని తెలంగాణలో ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని ద్రోహులుగా చిత్రీకరించే కుట్రలు టిఆర్ ఎస్ పార్టీ పనిగట్టుకుని చేస్తుందన్నారు. తాను ప్రశ్నిస్తే మరింత కటువుగా నా ఉనికి తెలంగాణ లో లేకుండా కేసీఆర్ ప్రయత్నం చేశాడని ఎన్నికల్లో తనను ఓడించేందుకు అస్త్ర, శాస్త్రాలన్ని ప్రయోగించడాని అందులో నుండి పుట్టిందే దళితబంధు అన్నారు. తాను రాజీనామా చేయడం వల్లనే కేసీఆర్ దళితబంధు ప్రకటించార‌ని, దళితులకు న్యాయం జరుగుతుందని బిజెపి, తాను దళిత బంధును మనసారా స్వాగతించమన్నారు..

ఎన్నికలు ముగియగానే దళిత బందును ప్రవేశపెడుతాన్ని చెప్పి నెల రోజులు పూర్తయినా కేసీఆర్ దళిత బందు ఎందుకు అమలుచేయడం లేదని ఈట‌ల‌ ప్రశ్నించారు. ఇక హుజురాబాద్ ఎన్నికల సాక్షిగా 600 కోట్ల ధన ప్రవాహం పారిందని, 4000 వేల కోట్ల సంక్షేమ పథకాల పేరిట డబ్బు చేసిన నీచ చరిత్ర కేసిఆర్ దేనన్నారు..రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంపిటీసీల ను కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండలి ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు వారికి అతిద్యమిస్తూ క్యాంపు లకు తరలించారన్నారు. మండలి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపిటీసులు, ఎంపిపిలు, జెడ్పిటీసులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతరాత్మ సాక్షిగా ఓటేసి ఆత్మ గౌరవం చాటుకోవలని పిలుపు నిచ్చారు.

ఒక్క ఎకరా కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా..
కేసిఆర్ సారధ్యంలో ప్రభుత్వ యంత్రాంగం తెరాస నాయకులుగా పనిచేస్తున్నారని ఈటెల విమర్శించారు. భూములు కబ్జా చేశారని అనడం మతిలేని చర్య అంటూ అభివర్ణించారు. తాను ఒక్క ఎకరా కబ్జా చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. ఈటల ఒక మంత్రి స్థాయి పదవి లో ఉండి బెదిరించి అసైన్మెంట్ భూములు బలవంతంగా తీసుకుంటే సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ ఎన్ని వేల ఏకరాలు లాక్కుని ఉంటాడో మీరే ఆలోచించాలన్నారు . దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుంటే తెలంగాణ లో మాత్రం కేసిఆర్ రాజ్యాంగం అమలు అవుతుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసిఆర్ కు చెంపపెట్టు కావాలని ఆకాక్షించారు. కేసిఆర్ డ్రామాలు ఆపాలని ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో తదనంతరం సంగారెడ్డి బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement