Thursday, November 21, 2024

TG Assembly: కాంగ్రెస్ మాటంటే శాస‌న‌మే… రుణ మాఫీకి రూ.31వేల కోట్లు

వ్య‌వ‌సాయ రంగానికి 72 వేల కోట్లు
సంక్షేమానికి పెద్ద పీట‌
పంచాయితీల‌కు భారీగా నిధులు
ధ‌ర‌ణికి మ‌ర‌మత్తులు
త్వ‌ర‌లోనే రైతు భ‌రోసా కింద రూ.15వేలు
రైతు కూలీల‌కు రూ.12వేలు ఇస్తాం
జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాం..
మ‌హిళ‌ల కోసం మ‌రో కొత్త ప‌థ‌కం
బ‌డ్జెట్ లో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి వ‌రాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.

ఇక భ‌ట్టి తన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేద‌న్నారు. డిసెంబర్‌ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశామ‌న్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామ‌ని పేర్కొన్నారు.. గతంలో పేపర్‌ లీకులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడింద‌ని అంటూ త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించామ‌ని చెప్పారు. త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామ‌న్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామ‌న్నారు, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

రుణ‌మాఫీకి రూ .31 వేల కోట్లు …
ఇక రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విప‌క్షాల‌పై భ‌ట్టి మండిప‌డ్డారు. రుణమాఫీకి రూ.31వేల కోట్లు సమీకరిస్తున్నామ‌ని, త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు.. కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమ‌ని, అంటూ ఇప్ప‌టికే లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ చేశామ‌ని ప్ర‌క‌టించారు. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ అవుతుంద‌న్నారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది త‌మ‌ సంకల్పమ‌న్నారు. త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తామ‌న్నారు.

- Advertisement -

స‌న్నాల‌కు రూ 500 బోన‌స్ …
రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తాం. ప్రధాని ఫసల్‌ బీమా యోజనలో చేరబోతున్నాం. మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని భట్టి చెప్పారు. ఇక ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించామ‌ని తెలిపారు.

ధ‌ర‌ణికి మ‌ర‌మ్మ‌తులు…
గత ప్రభుత్వం కుట్రపూరితంగా ‘ధరణి’ని చేసింద‌ని విమ‌ర్శించారు భ‌ట్టి. లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా మందికి రైతుబంధు, రైతుబీమాలను కూడా చాలామంది రైతులు అందుకోలేకపోయార‌న్నారు.. ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేసామ‌న్నారు. కమిటీ అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పారు.

న‌కిలీల‌కు ఆడ్డుక‌ట్ట‌…
ఇక వ్య‌వ‌సాయానికి తీరని న‌ష్టం కలిగిస్తున్న న‌కిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.. ఎప్పటిక‌ప్పుడు విత్త‌నాల షాపుల్లో త‌నిఖీలు చేస్తున్నామ‌న్నారు.. అలాగే అక్ర‌మాలు జ‌రిపే వారిపై పీడీ యాక్ట్ ను కూడా ప్ర‌యోగిస్తున్నామ‌న్నారు..

ఉచితంతో రూ.2,351 కోట్లు ఆదా…
ఇక మ‌హాల‌క్ష్మీ ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మాట్లాడుతూ… 68.60 కోట్ల ప్రయాణాలను తెలంగాణ మహిళలు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా తెలంగాణ మహిళలకు రూ.2,351 కోట్లు ఆదా అయ్యింద‌న్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఎంతో మేలు జరుగుతున్నద‌ని భ‌ట్టి చెప్పారు.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ‘మహాలక్ష్మీ’ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీస్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

మ‌హిళ‌ల కోసం మ‌రో స‌రికొత్త ప‌థ‌కం…
మహిళలకు మరో పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు భ‌ట్టి. 63లక్షల మంది మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ రూపకల్పన చేసినట్లు చెప్పారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తామని వెల్ల‌డించారు.

ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5వేల గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే విధంగా కార్యచరణ చేపట్టి, రాబోయే ఐదేళ్లో 25వేల సంస్థలకు విస్తరించడానికి కృషి చేస్తామని చెప్పారు.

త్వ‌ర‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు..
డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పంపిణీ చేయ‌నున్న‌ట్లు భ‌ట్టి అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. ధాన్యం సేకరణ కేంద్రాలను పెంచామ‌ని, మరింత ఆధునీకరణకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఇక రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌కు పాల్ప‌డిన రైసు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకున్నామ‌న్నారు.

గాంధీ, ఇందిరమ్మ, రాజీవ్ ల ఆశయస్ఫూర్తితో గ్రామీణ స్వరాజ్యానికి కృషి చేస్తామ‌న్నారు. ‘మిషన్ భగీరథ’లో జరిగిన అవకతవకల వల్ల ఇప్పటికీ చాలా గ్రామాల్లో తాగునీటి వసతి లేద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి. తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించామ‌ని పేర్కొన్నారు. బాలబాలికలకు పౌష్టికాహారాన్ని అందించటంతో పాటు, విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా మార్చాలని నిర్ణయించామ‌ని చెప్పారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశామ‌ని, పాఠశాలల నిర్వహణను అప్పగిస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement