కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీనే కాదని ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధిస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తానని అన్నారు.
మోడీ నాయకత్వాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని అన్నారు. నేనే కాదు.. బీజేపీ అభ్యర్థులందరం రాముడిని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని వెల్లడించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 350 పైచిలుకు స్థానాలు రాబోతున్నాయని అన్నారు. కాగా, శనివారం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 195 మందితో మొదటి లిస్ట్‌ను ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిలు పోటీ చేయనున్నారు.