హైదరాబాద్: కాంగ్రెస్ టికెట్ కోసం అర్జీలు పెట్టుకునే ఆశావహులతో హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆశావహులు, వారి అనుచరులతో గాంధీభవన్ ఆవరణంతా రద్దీగా మారింది.. కాగా, నిన్నటి వరకు దాదాపు 280 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ్టి నుంచి అర్జీలు పెట్టుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దరఖాస్తుకు ఈ నెల 25వ తేదీ చివరి రోజు కావడంతో భారీగానే అర్జీలు వస్తాయని పీసీసీ అంచనా వేస్తోంది.
ఇది ఇలా ఉంటే జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లికి చెందిన పలువురు భారాస నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాయకులకు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శంకర్‌పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్, భాజపా మాజీ జడ్పీటీసీ రవీందర్‌తోపాటు పలువురు మాజీ సర్పంచులు, ఇతర భారాస కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరినవారిలో ఉన్నారు.