Saturday, November 23, 2024

వీహెచ్‌కు రేవంత్ పరామర్శ.. కొత్త అధ్యక్షుడికి కీలక సూచన!

అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను ప్రకటించిన అనంతరం అసంతృప్తి నేతలతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే వీహెచ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్యని ఆయ‌న నివాసంలో మార్య‌ద పూర్వ‌కంగా క‌లిశారు. అనంతరం వీహెచ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లారు.

వీహెచ్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందన్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. హాస్పిటల్ లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై ఆయన చర్చించారని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాలని తనకు సూచించారని తెలిపారు. పార్టీ అభివృద్ధి విషయానికి సంబంధించి కొన్ని సలహాలను ఇచ్చారని, సోనియాగాంధీ వద్దకు కలిసి వెళదామని చెప్పారని వివరించారు.

కాగా, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరును మొదట్లో వీహెచ్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. గతంలో బహిరంగంగా రేవంత్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని, పార్టీకి విధేయులుగా ఉన్నవారినే కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు చల్లారేది ఎలా?

Advertisement

తాజా వార్తలు

Advertisement