పంటలు ఎండుతున్నా.. కనిపించట్లేదా..
20లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
ఎకరాకు రూ. 25వేలు పరిహారం ఇవ్వాలి..
రైతులకు అండగా బీఆర్‌ఎస్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లిలో 36 గంటల రైతు నిరసన దీక్ష
పెద్దపల్లి రూరల్, మార్చి 30 (ప్రభన్యూస్): ఎన్నికల ముందు చెప్పిన మాయమాటలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో సాగునీరు అందక ఎండుతున్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పెద్దపల్లి బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం 36 గంటల నిరసన దీక్షను కొప్పుల ప్రారంభించి దీక్షలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ… రైతులకు సాగు నీరందక సుమారు 20లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఎండిన పంటలను చూసి రైతులు కంట కన్నీరు పెడుతున్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదా.. అని నిలదీశారు. పంటలు ఎండుతున్నా సాగునీరు సరిపడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తక్షణమే పంటలకు సాగు నీరందించాలని, ఎండిన పంటలకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు గోసను పట్టించుకోని కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎండిన పంటలను పరిశీలించామని, పెద్దపల్లి జిల్లాలో వెల ఎకరాలలో పంటలు ఎండిపోయాయని, రైతులకు భరోసా కల్పించి అండగా నిలిచేందుకే రైతులు నిరసన దీక్షను చేపట్టినట్లు పేర్కొన్నారు.
తమ దీక్షతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అధైర్య పడవద్దని, బీఆర్‌ఎస్ పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి ఎండిన పంటలను పరిశీలిస్తారని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలకు అండగా ఉంటూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, నాయకులు రఘువీర్ సింగ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.