కౌంటింగ్ సమయంలో అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో లోక్‌సభ అభ్యర్థులు, ఇన్‌చార్జిలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. పోటా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్‌గా పంపాలన్నారు.
సీనియర్లను కూడా తీసుకెళ్లండి..
సీనియర్ నాయకులను కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి రౌండ్‌లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.