Tuesday, November 19, 2024

Congress నిర్వాకంతోనే కోల్డ్ స్టోరేజ్ లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం…కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను ప్రధాని మోడీఅర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తుషార్ మెహతా కమిటీని వేసి, వదిలేసిందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్… కమిటీ నివేదికను కూడా చదవలేదన్నారు.

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత జులై నెలలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారని, ఎస్సీ రిజర్వేషన్ అంశంపై చర్చించారన్నారు. అగస్ట్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారన్నారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయన్నారు. వర్గీకరణ జరగాలని ఒక ధర్మాసనం, జరగకూడదని మరో ధర్మాసనం తీర్పు చెప్పాయన్నారు. చివరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీం చెప్పిందన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement