బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మంత్రి హరీష్ రావు ఇద్దరూ దొంగలేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండాలనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపామని జీవన్ రెడ్డి వివరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వల్లే హుజూరాబాద్ పచ్చగా మారిందన్నారు. హుజురాబాద్ కు మేలు చేసిన కాంగ్రెస్ కి అందరూ మద్దతుగా ఉండాలని… హస్తం గుర్తుకు ఓటేసి బల్మూర్ వెంకట్ ని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి అంటుంటే… మంత్రి హరీష్ రావు అందుకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వరి విత్తనాలు అమ్మితే సీజ్ చేస్తామంటూ కలెక్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, అసలు ఆ అధికారం కలెక్టర్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక, పెళ్ళిళ్ళు కానీ పరిస్థి నెలకొందని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు టీఆర్ఎస్, బిజెపిలకు బుద్ది చెప్పే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. 2014 లో వాగ్దానం చేసిన కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ కే దిక్కులేదన్న జీవన్ రెడ్డి… ఇప్పుడు హుజూరాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతామని చెప్పడం వింతగా ఉందన్నారు. టీఆర్ఎస్ నేతల మాటలు నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరన్నారు. ప్రజలు అధికార పార్టీ చేస్తోన్న పనులను గమనిస్తున్నారని..ఇకపై వారి ఆటలు చెల్లబోవని జీవన్ రెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ కు పవన్.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?