కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలు, కుట్రలు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దెవా చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ మాత్రమే అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులేదని.. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మోసపూరిత ప్రకటనలు చేశారన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్రలు అని లక్ష్మణ్ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో అవినీతిని బయటికి తీస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి .. దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటే అన్నారు. ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి.. 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారని, కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు నమ్ముతున్నారన్న లక్ష్మణ్.. హస్తం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ నేతలు అవినీతిపరులన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడెందుకు వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.