సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే గడువు ఉన్న వేళ కాంగ్రెస్ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల బాధ్యులను మార్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రేను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు గోవా, దామన్-డయ్యూ, దాద్రా నగర్ హవేలీ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వ్యవహరించిన దీపాదాస్ మున్షికి కేరళ, లక్ష్యద్వీప్‌తో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు.
గతంలో తెలంగాణ వ్యవహారాల బాధ్యులుగా వ్యవహరించిన మాణికం ఠాగూర్‌కు ఏపీ, అండమాన్ నికోబార్ వ్యవహారాలను అప్పగించారు. అజయ్ మాకెన్‌ను ట్రెజరర్‌గా, మిలింద్ దియోరా, విజయ్ ఇందర్ సింగ్లా జాయింట్ ట్రెజరర్లుగా వ్యవహరించనున్నారు. జనరల్ సెక్రటరీగా ఉన్న తారిక్ అన్వర్‌ను, ఇన్‌ఛార్జులుగా ఉన్న భక్తచరణ్ దాస్, హరీశ్ చౌదరి, రజనీ పాటిల్, మనీశ్ చత్రాఠ్‌ను ఆయా బాధ్యతల నుంచి తప్పించారు.
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఛత్తీస్‌గఢ్ బాధ్యతలను అప్పగించింది. యూపీ బాధ్యతలు చూస్తున్న ప్రియాంక గాంధీని ఆ స్థానం నుంచి తప్పించి.. అవినాశ్ పాండేకు ఆ రాష్ట్ర బాధ్యతలను కట్టబెట్టింది. ప్రియాంకకు ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియామకాలు చేపట్టినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు