హైదరాబాద్, ఆంధ్రప్రభ: వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్‌ఎస్ టార్గెట్‌గా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యా చరణ సిద్ధం చేసుకుంటోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కానీ హామీలను ప్రధానంగా ప్రస్తావించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ది, సంక్షేమ హామీలు, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయంలో ప్రజలకు చేసిన అభివృద్ధిపైన గ్రామాల్లో చర్చ పెట్టాలనే ఆలోచన ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీటినే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన పథకాలు.. ఇప్పుడు అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పొందిన లబ్ధిదారుడి ఓటును కాంగ్రెస్ పార్టీ అడగదని, అదే ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వారిని బీఆర్‌ఎస్ ఓటు అడగకుండా ఉంటుందా..? అని సవాల్ విసరాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే కోవలో కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన, బీసీలు పేద వర్గాలకు లక్షలాది ఎకరాల భూములను పంచిందని గుర్తుచేయనున్నారు.
కేసీఆర్ ప్రభత్వం భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణి చేస్తామన్న హామీని విస్మరించి మోసం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి మూడు ఎకరాల భూమి లబ్ధిదారులను కాంగ్రెస్ పార్టీ టచ్ చేయదని, అదే కాంగ్రెస్ ప్రభుత్వాల హయాం లో భూములు పొందిన దళిత, గిరిజన, బీసీ, పేద వర్గాల ఓటును అడగకుండా బీఆర్‌ఎస్ నాయకు లు ఉంటారా? అని ప్రశ్నించాలనే పీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నిరుద్యోగు లకు రూ.3,116 నిరుద్యోగ భృతి ఇస్తామని ఏ ఒక్కరికి ఇవ్వకపోగా రాష్ట్రం లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులను కూడా మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని, రూ.లక్ష వరకు రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని ప్రశ్నించాలని నిర్ణయించారు. నిరుద్యోగులను, రైతులను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ ప్రభుత్వం కోల్పోయిందనే ప్రచారాన్ని విస్తృతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇదిలా ఉండగా, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే అమలు చేసే అంశాలను ప్రజల ముందు ప్రస్తావించాలని నిర్ణయించారు. అందులో ప్రధానంగా ఐదు అంశాలను కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, చేయూత పథకం ద్వారా అందించే రూ.4 వేల పెన్షన్, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు వంట గ్యాస్‌ను రూ.500లకే ఇస్తామన్న హామీలు ప్రజలకు కనెక్టయ్యే విధంగా ప్రచారం చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఈ ఐదు పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వర్తించే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. రూ.4 వేల పెన్షన్ పథకం 80శాతానికి పైగా కవర్ చేస్తుందని, రైతు రుణమాఫీ రైతు కుటుంబాలను, రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి సాయం, రూ.500లకు గ్యాస్ బండ పథకాలు పేద వర్గాలందరిని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావనలో ఉన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీతో నిరుద్యోగ యువత, విద్యార్థుల నుంచి మద్దతు లభిస్తుందనే ధీమాతో ఉన్నారు.