Tuesday, November 26, 2024

Congress లో 60 ప‌ద‌వులు.. 200 మంది పోటీ


అనేక మంది సమిష్టి కృషి ఫలితంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవుల పందేరం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు సీనియర్లు, మరోవైపు కీలకంగా పనిచేసిన జూనియర్లు తమ డిమాండ్లతో ఢిల్లీ స్థాయి పైరవీలు మొదలుపెట్టారు. మేం దశాబ్దాల పాటు పార్టీలో ఉన్నామంటూ పదవుల కోసం కాంగ్రెస్ లో “నివురుగప్పిన నిప్పు” లా సీనియర్ల ఆక్రోశం కనిపిస్తోంది. ముందుగా అనుకున్న ప్రణాళిక వీగిపోవడంతో సంక్రాంతికి ఊరించి ఉసూరుమనిపించిన నామినేటెడ్ పదవులపై కొంతమంది గుర్రుతో ఉన్నారు. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చేసేదేమీ లేక తనపై భారం తగ్గించుకునేందుకు పోస్టుల భర్తీ అనే బంతిని ఢిల్లీ లోని ఏఐసీసీ కోర్టుకు విసిరిన రేవంత్ తెరవెనక రాజకీయం నడిపిస్తున్నారు.

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
కాంగ్రెస్ పార్టీ లీడ‌ర్ల‌లో రోజు రోజుకూ అస‌హ‌నం పెరిగిపోతోంది. వారిలో ఆక్రోశం తారాస్థాయికి చేరుతోంది. నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ‌పెట్టుకున్న చాలామంది సీఎం రేవంత్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేస్తున్నారు. కాగా, పక్షం రోజులుగా పదవుల పందేరంపై ఎడతెగని కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఆరు సార్లు ఢిల్లీ వెళ్లినా తెగని పంచాయతీపై కొందరు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. బలమైన పోటీ, అగ్రశ్రేణి నాయకుల డిమాండ్లే ఆలస్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో భర్తీకి సిద్దంగా ఉన్న సుమారు 60 పదవులకు 200 మందికి పైగా పోటీ కనిపిస్తోంది.

ఊరిస్తున్న నామినేటెడ్ ప‌ద‌వులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. నాయకులను నామినేటెడ్ పోస్టులు ఊరిస్తున్నాయి. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతుండటంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారంతా అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో ఆ పోస్టులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పోస్టులకు ఎవరెవరు పోటీ పడుతున్నారో, ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? అనేది ఈ నెల 20న జరగనున్న కీలక సమావేశంలో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది.

ఆశ‌లు పెంచుకున్న సీనియ‌ర్ లీడ‌ర్లు

ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కొంతమంది సీనియర్లు సైతం ప్రస్తుతం ఎలాంటి పోస్టులు లేక కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోనూ సీనియర్ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ద్వితీయ శ్రేణి నాయకత్వం దాదాపు వందమందికిపైగా నేతలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది. సంక్రాంతి లోపు శుభవార్త వినాలని సీనియర్లు పట్టుబడుతున్నారు.

- Advertisement -

వారం క్రితం విస్తృత స్థాయి భేటీ

ఇదే అంశంపై గత వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి విస్తృతస్థాయి సమావేశం ఇదే. పార్టీ అధికారంలోకి వచ్చాక పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశంలోనూ అనంతరం విస్తృతస్థాయి సమావేశంలోనూ నామినేటెడ్ పదవుల పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో పీఏసీ సభ్యులతో పాటు ముఖ్యమైన నాయకులు అంతా పాల్గొని తమతమ అభిప్రాయాలను తెలిపారు.

ఫ్రంట్‌లైన్‌లో ప‌లువురు కీల‌క నేత‌లు

డీసీసీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ఫ్రంట్ లైన్ లో ఉన్న వారు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఛైర్మన్లు.. వీరందరూ సమావేశానికి హాజరై తమ డిమాండ్లను సైతం పార్టీ అధిష్టానం ముందుంచారు. పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ సమావేశం జరగడంతో అందరూ సంక్రాంతి లోగా పదవులు వరిస్తాయని అనుకున్నారు. దీనికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షి కూడా కాజరయ్యారు.

సంక్రాంతికి వ‌స్తాయ‌ని ఆశ‌ప‌డితే..

నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పార్టీ ముఖ్యమైన నేతలు అంతా కూడా నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి లోపే చాలామందికి తీపికబురు వినిపిస్తారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది సీనియర్లకు హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. సరసారిగా కేబినెట్ ర్యాంకు కలుపుకుని 50 నుంచి 60వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వాటిలో కనీసం 20 నుంచి 30వరకు పదవులను సంక్రాంతి పండగ వరకు భర్తీ చేయాలని అనుకున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో..

పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమైన నాయకులకు అందరికీ జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ కసరత్తు అవసరమవుతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫ్రంట్ లైనర్స్ లో మహిళా కాంగ్రెస్ నేతలకు తప్ప మిగతా వారికి ఎవరికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన పరిస్థితి లేదు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, రైతు విభాగం.. ఇలా చాలా విభాగాల్లో ఎవరికీ టికెట్ దక్కలేదు. కాబట్టి ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన వారంతా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement