Saturday, November 23, 2024

ట్విట్టర్‌లో సమస్యలు పరిష్కారం కావు.. అందరికీ ట్వీట్‌ చేసే నైపుణ్యం లేదు!

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనోవేదనల పరిష్కారానికి దోహదపడే ప్రజాఫిర్యాదుల విభాగాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూల్చివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆరోపించారు. ‘మంత్రులు, అన్ని శాఖల విభాగాలు చిరునామా లేకుండా పనిచేస్తున్నాయి. శాశ్వత పేషీ లేకుండా పనిచేస్తున్నాయి. ప్రజలు తమ గోడును వినిపించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలి. ఏ అడ్రస్‌కు ఫిర్యాదు చేయాలి. ఇందుకు ఏవిధమైన వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ప్రజాఫిర్యాదుల విభాగాన్ని నిర్వీర్యం చేసింది. ఇలా చేయడం  పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం. తెలంగాణలోని ప్రతి పౌరుడు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసే స్థాయిలో లేడు. ప్రతి వినియోగదారుడుకీ ట్విట్టర్‌ను ఉపయోగించే నైపుణయం లేదు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్వపు ప్రజాఫిర్యాదుల విభాగాన్ని పునరుద్ధరించాలి ‘అని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

కొందరు మంత్రులు ఫిర్యాదుల యంత్రాంగాన్ని సోషల్‌ మీడియా వేదికగా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని షబ్బీర్‌ అలీ ఆరోపించారు.  కేటీఆర్ సహా కొందరు మంత్రులు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని చెప్పారు. ట్విట్టర్‌తో పరిచయం ఉన్న కొంత మంది తమ సమస్యలను అతి స్వల్పంగా పంచుకుంటున్నారు. వాటిలో కూడా ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే ట్విట్టర్‌ ద్వారా మంత్రుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మంత్రి కూడా తనకు ఎదురైన అన్ని సమస్యలను ట్విట్టర్‌ ద్వారా పరిష్కరిస్తున్నట్లుగా తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.. వాస్తవానికి పలు సమస్యలను పంచుకుంటున్న వినియోగదారులలో ఎక్కువ మంది  మంత్రి కార్యాలయం అడ్డుకుంటోందని అన్నారు. లేదంటే అలాంటి ట్వీట్లకు స్పందించడం లేదు. ఇది సామాన్య ప్రజలను అవమానించడమేనని షబ్బీర్ అలీ చెప్పారు.

సీఎం కేసీఆర్ గత ఏడేళ్లుగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేరని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. సాధారణ ప్రజలను మినహాయించడంలో సీఎం కేసీఆర్‌ను మంత్రులు కూడా అనుకరిస్తున్నారని విమర్శించారు. కోవిడ్‌ –19 తో సహా అనేక ప్రజా సమస్యలపై ఫిర్యాదుల విభాగం ఎక్కడా పనిచేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను నియంతృత్వంగా మార్చారని మండిపడ్డారు. ఫిర్యాదుల విభాగం లేకపోవడం వల్లే ఎంతోమంది ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్స్‌)ను దాఖలు చేసేందుకు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని షబ్బీర్‌ చెప్పారు.

ప్రభుత్వం ఉదాశీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించి ప్రజారోగ్య పరిస్థితులు చేజారిపోకుండా చేసిందని కొనియాడారు. కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారిపోయేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఆదేశాల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచిందన్నారు. ఫలితంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుందని చెప్పారు. కోవిడ్‌ చికిత్స కోసం అధిక మొత్తాలను వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉన్నప్పటికీ, కేసీఆర్‌ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల అధిక బిల్లుల దోపిడీ సొమ్మును బాధితులకు ప్రభుత్వం ఇప్పించలేదని షబ్బీర్‌ అలీ విమర్శించారు.

ఇది కూడా చదవండి: తొలుత వెంకయ్య… తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్.. నెక్ట్స్ ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement