తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రంగా మండిపడ్డారు. గాంధీభవన్ లో గాడ్సే దూరిండు అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సోనియా గాంధీ ప్రజల కోరిక మేరకు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఆపాలని తెలంగాణ ఇస్తే గాడ్సేల్లగా పాల్సిస్తూ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్లు సర్వ నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే ఇటీవల రెండు సార్లు ఢిల్లీకి పోయి మోడీ కాళ్ళు మొక్కి వచ్చాడన్నారు. నోట్ల రద్దు నుంచి 370 ఆర్టికల్ రద్దు వరకు అనేక అంశాలలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులకు ఉరి తాళ్లుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేయమంటే పారిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్, కేటీఆర్ లకు వెన్నులో వణుకు పుడుతుందన్నారు. తెలంగాణలో ఏడేళ్ళ పాలనలో టిఆర్ఎస్ ప్రజలకు ఏమి చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మీద పడి ఏడవడం ఎందుకు? అని నిలదీశారు.
దళిత బంధు ఇస్తామని ఆపేశారన్న మల్లు రవి.. దళితులకు భూములు, ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి లాంటివి అన్ని పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ను నిందించడం కెటిఆర్ కు ఫ్యాషన్ అయిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: రాజీనామాకు రెడీ: పరిటాల సునీతకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్