నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్ 23 (ఆంధ్రప్రభ) : మహారాష్ట్రలో కాంగ్రెస్ కి పట్టిన గతే తెలంగాణలో కూడా పడుతుందనీ, మహారాష్ట్ర మహాయుతిదేనని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ అన్నారు. మహారాష్ట్ర రిజల్ట్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ కు కుర్చీ భయం పట్టుకుందన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిఖిల్ సాయి చౌరస్తాలో మహారాష్ట్ర ఫలితాలపై విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కార్యకర్తలతో కలిసి మిఠాయిలు పంచుకొని, టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… కాంగ్రెస్ గ్యారంటీల మోసానికి మరాఠ ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మరాఠ ప్రజలు మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ ను కోరుకు న్నారని హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ఓటరు మహాశయులందరికీ పేరు, పేరున ధన్యవాదములు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందన్న అబద్దపు ప్రచారం చేసి కుట్ర చేసిన కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు.
ఈవీఎంల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ మంత్రులందరూ ఆలోచనలో పడ్డారని, ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయకపోతే వచ్చే స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.