Friday, October 4, 2024

ADB: ఉదయం కాంగ్రెస్.. మధ్యాహ్నం బీఆర్ఎస్ పోటాపోటీ ప్రారంభోత్సవం..

బోథ్, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీపడి మరి ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ బోథ్ మండల ఇన్చార్జి ఆడే గజేందర్, మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య, అధికార ప్రతినిధి పతుల చంటి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను సన్మానించారు.

రైతులకు కావలసిన అన్ని రకాల వసతులను కల్పిస్తామని తెలిపారు. అయితే మధ్యాహ్నం సమయంలో బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీపీ తులా శ్రీనివాస్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, జాయింట్ కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులతో కలిసి మళ్లీ అదే సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా ఒకే సొయా కొనుగోలు కేంద్రాన్ని రెండుసార్లు ప్రారంభించినట్లు అయింది. రెండుసార్లు సొయా కేంద్రాన్ని ప్రారంభించడంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్ యార్డులో మార్కెట్ చైర్మన్ కు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎలా ప్రారంభిస్తారని చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఈ విషయమై జాయింట్ కలెక్టర్, మార్క్ఫెడ్ డీఎం, డీసీఓ లపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏదేమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ లో రాజకీయం బోథ్ నియోజకవర్గంలో తారస్థాయికి చేరిందని, ఇకముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఇరుపార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement