Friday, November 22, 2024

TS: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. గొడవ పెట్టింది.. కేటీఆర్

సిరిసిల్ల, (ప్రభన్యూస్) : పార్లమెంటు ఎన్నికల్లో 12 సీట్లు ఇవ్వండని, ఆరు నెలల్లో కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని, ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్లీ మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్, గాంధీ చౌక్ చౌరస్తా, కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి కూడలి ల వద్ద కార్నర్ మీటింగులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇంటింటికి వచ్చి డ్రామా చేస్తారని, ఆగం కావద్దని, ప్రధాని మోడీ అన్నీ చేసిందని ఎవడైనా, బీజేపీ వాడైన వస్తే పప్పు, ఉప్పు, పెట్రోల్, సిలిండర్ ధరలు ఎందుకు పెరిగాయని, మీకు ఎందుకు ఓటు వేయాలని అడగండని, సిరిసిల్లకు ఒక్క పని చేసినవా అని నిలదీయాలని, ఆగం కావద్దని కేటీఆర్ పిలుపు నిచ్చారు.

నాకు జోడిగా ఎంపీగా వినోద్ కుమార్ ను గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి పక్కా వస్తుందన్నారు. ఎండలు మండుతున్నాయి, కరెంటు కోతలు పెరిగాయి, నీళ్లకు గోసపడుతున్నారని ఇది పోవాలంటే, మళ్ళీ కేసీఆర్ రావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు వస్తది, కరెంటు ఉండదని చెప్పామని, కరెంటు కోతలు చాలు అయ్యాయని మార్పు మంచిగా ఉన్నదా అని ప్రజల్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వీపులు పగులగొట్ట బుద్ధి అవుతున్నదా అని ప్రజల్ని అడిగాడు.

- Advertisement -

తనకు జోడిగా ఎంపీ ని గెలిపిస్తే ఇద్దరం కలిసి ప్రభుత్వ మెడలు వచ్చేది పక్క అని, దొంగ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా ప్రజల తరపున కొట్లాడే జమ్మేదారి తనదని అన్నారు. మన కొట్లాట కాంగ్రెస్ తో కాదని, మనకు వారితో పంచాయితీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో చౌరస్తాలో కండువా వేసుకుని నిలిచి ఉంటే తప్ప ఒక్కరు గుర్తుపట్టరని, అందుకే వారితో పంచాయితీ లేదు, ఉన్నదంతా అక్షంతలు వారితోనే పంచాయతీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పిచ్చోడిని, ఎడ్డి వాడిని తీసుకువచ్చి అభ్యర్థిగా పెట్టారని, వాడు ఎవడో తెలవదు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరని, కాంగ్రెస్ చేసిన మోసం ప్రజలకు అర్థం అయిందని అందుకే కాంగ్రెస్ తో పోటీ లేదని, బిజెపి చేసిన మోసం అర్థం చేసుకునే బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు

. బండి సంజయ్ ఎప్పుడైనా గల్లీలలో సిరిసిల్లలో కనిపించాడా, గాలి తిరిగుళ్ళు, గాలి ముచ్చట్లు అన్నీ పిచ్చి మాటలు, మసీదులు తవ్వమంటున్నాడు శవం తేలితే మీది శివం తేలితే మాది అంటున్నాడని, తవ్వేది ఉంటే డబుల్ బెడ్ రూముల ఇండ్ల పునాదులు తవ్వాలని, చెరువులు, కళాశాలలు, బడుల పునాదులు తీసి నిర్మించాలని అన్నారు. మతం పేరుతో ముస్లింలను దుర్మార్గులుగా చూపుతున్నారని, పోరగాండ్ల నెత్తులు ఖరాబు చేస్తున్నాడే తప్ప ఐదేళ్లలో ఒక్క మంచి పని కూడా బండి సంజయ్ చేసిండా అని ప్రజల్ని కేటీఆర్ ప్రశ్నించారు.

నేను చెప్పింది తప్పని ఎవరైనా రుజువు చేస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డి, బిజెపి వాడు ఎవడైనా రుజువు చేస్తే నా రాజీనామాను ఇక్కడే తెలంగాణ తల్లి వద్ద చేసి తెల్లారే వరకు ఎమ్మెల్యే పదవిని ముఖాన కొట్టి వెళ్ళిపోతానన్నారు. తాను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నదని, నరేంద్ర మోడీ 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్లకు పంచి పెట్టాడని ఆరోపించారు. అన్ని పిరం చేసి ధరలు పెంచి, నిరుద్యోగం పెంచిన మోడీ అక్షింతలను దేవుడిని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నాడని ఆరోపించారు. కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, తిరుపతి వెంకన్న, సిరిసిల్ల మార్కండేయ స్వామి ఎప్పుడో ఉన్నారని, 40 ఏళ్ల క్రితం వచ్చిన బిజెపి తామే దేవుని అర్సుకుంటున్నామని, తాము లేకుంటే దేవుడు ఆగమవుతాడని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

దేవుడు కూడా లంగలకు దొంగలకు ఓటువేయమని చెప్పడని, శ్రీరాముడు అందరివాడు రాజధర్మం పాటించమన్నాడని పేర్కొన్నారు. మరి వరదలు వచ్చినప్పుడు గుజరాత్ కు 1000 కోట్లు ఇచ్చి హైదరాబాదుకు బుడ్డ పైసా ఇవ్వలేదని ఇదేనా రాజధర్మం అంటే అని ప్రశ్నించారు. ఇద్దరు కొడుకులు ఉంటే సమానంగా చూడాలని గుజరాత్ కు ఒక న్యాయం మనకు సవతి తల్లి ప్రేమ అని ఇదేనా రాజధర్మం అని ప్రశ్నించారు. ముస్లింలను దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ హిందువులకు మాత్రం చేసిందేమీ లేదని, పదేళ్లలో ఏమీ చేయని, గాలి తిరుగుడు, గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ల చేతిలో మోసపోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధికి కారణమైన కేసీఆర్ కు, అయనపై ప్రేమ ఉంటే బలం ఇవ్వండని నాకు జోడిగా ఎంపీని గెలిపించండి అని, అక్షింతలకు మోసపోవద్దన్నారు. రాముడి పటానికి ముక్కాలని, బిజెపిని ఓటుతో తొక్కాలని కేటీఆర్ పిలుపు నిస్తూ రాముడు దేవుడని, బిజెపికి ఓటు వేయకపోయినా రాముడికి ఏమీ కాదని పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఎవరికి రూపాయి సాయం చేయలేదని, పదేళ్లుగా పప్పు ఉప్పు చింతపండు పెట్రోలు డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలన్నీ పెంచాడని, ప్రజలపై కొత్త పన్నులు వేస్తూ పీడించి 30 లక్షల కోట్ల పన్నులు ప్రజల రక్తం పీల్చి వసూలు చేసిన మోడీ తన దోస్తులకు పదునాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడని కేటీఆర్ ఆరోపించారు.

ఇక సిరిసిల్ల జిల్లాను తీసేయాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడని, సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి తో పాటు 16 జిల్లాలను తొలగించడానికి యత్నిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్దాలు ఆడుతున్నదని, మహిళలకు రూ. 2500 ఇచ్చామని రాహుల్ గాంధీతో అబద్ధం చెప్పించారని ఆరోపించారు. తమకు కొట్లాడడానికి ప్రజలు ఎన్నికల్లో శక్తి నివ్వాలని, డబుల్ బెడ్ ఇల్లు కొందరికి రాలేదని వారందరికీ వచ్చేలా తాను బాధ్యత తీసుకుంటానని, అయితే దేవుడు పేరుతో మోసపోవద్దని, బిజెపిని ఓడగోట్టాక దేవుళ్లకు ముక్కాలనీ, సిరిసిల్ల జిల్లాను కాపాడుకుందామాని, నేతన్నల బతుకులు బాగు చేసుకుందామని, నేతన్నల బతుకు తెరువుకు బలంగా ప్రయత్నం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదని, బుల్లెట్ రైల్లు రాలేదని, సిరిసిల్లకు పైసా ఇవ్వలేదని ఆరోపించారు. మన బతుకులు బాగుపడాలంటే మనకు తెలిసిన వాడు ఎంపీగా ఉండాలన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు కేసీఆర్ ను బూతులు తిట్టుకుంటూ తిరిగితే వాటితో మనకు కడుపు నిండదని, దానితో లాభం జరగదన్నారు. కేసీఆర్ కు ఓటు ఎందుకు వేయాలో వంద పనులు చూపిస్తామన్నారు. నేతన్నల కడుపు కొట్టి ఐదేళ్లలో మోడీ ఒక్క ఆర్డర్ ఇవ్వలేదని పైగా జిఎస్టి విధించారని కేటీఆర్ ఆరోపించారు.

ఈ సమావేశాలలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ జెడ్పి చైర్ పర్సన్ తుల ఉమ, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement