గద్వాల (ప్రతినిధి) మార్చి 30 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ స్థాయి కన్వీనర్ల శిక్షణ శిబిరం జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య, ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ అధ్వర్యంలో శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని కే.ఎస్.ఇవెంట్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మల్లు రవి, సిడబ్ల్యుసి మెంబర్ కొప్పుల రాజు, ఏఐసిసి రోహిత్ చౌదరి, ఏఐసిసి సెక్రెటరీ సంపత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్, మాజీ జెడ్పి చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపి మందా జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహాం, రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకర్, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, టిపిసిసి పవన్ మలధీ, సంధీష్, సంతోష్ రుద్ర, ఓబీసీ అధ్యక్షుడు నల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇసాక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి గెలుపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలన్నారు. మోడీ అన్యాయ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కోరుతున్నారన్నారు. మూడు లక్షల మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుందామని, పార్లమెంటు అభ్యర్థి మల్లు రవిని గెలిపించుకుని లోక్ సభకు పంపాలన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కొందరి వ్యాపారవేత్తల లాభాల పెరుగుదల కోసం దేశాన్ని నడిపిస్తోందని, రైతులు, యువత, మహిళలు, దళిత, ఓబిసి, బహుజన, గిరిజన, మైనారిటీ చిన్న వ్యాపారవేత్తలు దేశంలోని పేదరిలందరికీ అన్యాయం చేస్తుందన్నారు.
కర్ణాటక, తెలంగాణ ఎన్నికలలో చేసిన వాగ్దానాలన్నింటిని అమలు చేయడం ప్రారంభించిందని ప్రముఖులు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తున్న 5 గ్యారంటీ పథకాలను ప్రజలలోకి తీసుకుని పోవాల్సిన భాద్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని, బూత్ లెవెల్ లో ప్రణాళిక బద్దంగా ఏజెంట్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తే నాగర్కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి మల్లు రవిని 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలుచుకోవడం ఖాయమని, నేటి నుండి ఓటర్లకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని బూత్ లెవెల్ ఏజెంట్లకు అతిధులు ప్రణాళికను దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లు, వివిధ స్థాయి తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, బూత్ లెవెల్ కన్వీనర్ల, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.