ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : ఎలాగూ అధికారంలోకి రామనే ఉద్దేశ్యంతో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు అబద్దాలు చెప్పి…తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతుల నోట్లో మట్టికొడుతున్నారని… రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్, మానకొండూర్ నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావుల నివాసాల్లో రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ… ఇది కాలం తెచ్చిన కరువు కాదని… కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షగట్టి తెచ్చిన కరువన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రైతుల బ్రతుకులు ఆగమైపోతున్నాయన్నారు. సాగునీళ్లు లేక ఎండిన పంటలకు ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25000ల పంట నష్ట పరిహారంతో పాటు…యాసంగి వరి పంటకు క్వింటాలు కు రూ.500ల భోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ మద్దతు ధర కంటే ఏ ఒక్క రైతు పంట అమ్ముకోరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడానికే కమిటీల పేరుతో కాలయాపన చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం.. రైతులు బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతు రుణమాఫీపై ఎందుకు స్పందించడం లేదన్నారు. మాయమాటలు మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలను అమలు చేయడం లేదన్నారు. రైతులకు ఎండిన పంటలకు రూ.25000ల నష్ట పరిహారం, క్వింటాలు కు రూ.500ల భోనస్, 2లక్షల రైతు రుణమాఫీ చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటి పంటలు ఎండిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయొద్దని అప్పటి మహారాష్ట్ర సీఎం పృద్విరాజ్ చౌహాన్ కు లేఖలు రాశారని, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా భూసేకర చేసేది లేదని వారు అప్పుడు మెలిక పెట్టడంతోనే ఆగిపోయిందన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ ల వద్దకు వెళ్లి ఒప్పించి భూసేకరణ చేయించి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక నుంచి పోరుబాట తప్పదని.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాక విడిచి పెట్టేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ రవిందర్ సింగ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మానకొండూర్ జడ్పీటీసి శేఖర్ గౌడ్, గడ్డం నాగరాజు, లింగాల లక్ష్మణ్, మహిపాల్ రెడ్డి, గంప వెంకన్న, గంట మహిపాల్, దేవేందర్ రెడ్డి, రాజశేఖర్ గౌడ్, సజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.