Friday, November 22, 2024

TG | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచుతోంది : బాల్క సుమన్

తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదు కానీ… రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా మాత్రం ఉద్యోగాలు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.

తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిరుద్యోగుల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు నిండా ముంచుతోందన్నారు. నిరుద్యోగుల హామీల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం నెర‌వేర్చే వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని యూనివ‌ర్సిటీలలో, అశోక్ న‌గ‌ర్, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని కోచింగ్ సెంట‌ర్ల చుట్టూ తిరుగుతూ నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొట్టి నాటి ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా కార్య‌క్ర‌మాలు చేపట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామని, ఉద్యోగాల భ‌ర్తీ చేప‌డుతామ‌ని మాటిచ్చి మ‌భ్యపెట్టి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. గ్రూప్స్ విషయంలో హామీని నిలబెట్టుకోలేదన్నారు.

25 వేలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పి రెచ్చగొట్టారని… అధికారంలోకి వచ్చాక 5 వేల‌కు మరికొన్ని క‌లిపి మ‌మ అనిపించారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం… ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఖర్గే, ప్రియాంక గాంధీలతో చెప్పించారని గుర్తు చేశారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు లేవన్నారు. నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

నిరుద్యోగుల‌పై లాఠీఛార్జ్, అరెస్టులు చేస్తూ, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కోచింగ్ నిర్వాహ‌కుల‌ను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగుల వాట్సాప్ గ్రూపుల అడ్మిన్ల‌ను కూడా బెదిరిస్తున్నారన్నారు. నిరుద్యోగులను ఉపయోగించుకొని పబ్బం గడుపుకుని ఇప్పుడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.

- Advertisement -

ఎన్నికల కోడ్ కారణంగా బీఆర్ఎస్ హయాంలో 32 వేల ఉద్యోగాల భర్తీకి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం మానివేసి… పాలనపై దృష్టి సారించాలన్నారు. నిరుద్యోగుల హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే నిరుద్యోగులు నిలువునా చీరేస్తారని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement