- అన్నదాతల కంట కన్నీరు
- నాడు గింజ గింజకు కేసీఆర్ హామీ..
- నేడు గడియ గడియ గండమే
- మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- ట్విట్టర్‌లో విమర్శలు చేసిన కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. అకాల వర్షాలకు రైతన్నల రెక్కల కష్టం నీళ్లల్లో తడిసి ముద్దయిందని.. రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. మిల్లర్లు షరతులు విధిస్తున్నారన్నారు. పెళ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారన్నారని విమర్శించారు. తెలంగాణ రైతన్న నడ్డివిరిచి గాల్లో మోసకారి కాంగ్రెస్ విహరిస్తుందని మండిపడ్డారు.
దసరా, దీపావళి పోయినా..
దసరా, దీపావళి పోయిందని.. కార్తీకమాసం వచ్చినా కొనుగోళ్లు కానరావడం లేదన్నారు. నాడు గింజగింజకు కేసీఆర్ హామీ ఇచ్చారని.. నేడు గడియగడియ గండమేనన్నారు. మిల్లర్లతో చర్చలు లేవని.. రైతుకు భరోసా కరువైందన్నారు. అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్ అంటూ విమర్శించారు. ధాన్యం కొంటే రూ.500 బోనస్ అన్నారని.. అసలు కొనకుంటే అంతా భోగస్ అన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు, సమావేశాలు లేవన్నారు. ధాన్యంపై కప్పేందుకు కవర్లు లేవన్నారు. రుణమాఫీ జరగడం లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా లేదన్నారు. – చివరకు పంట కొనుగోళ్లు లేవన్నారు. లేవు లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమి లేవంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.