హెదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ) సమావేశం జరగనుంది. రేపు (సోమవారం) గాంధీభవన్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ సమావేశం ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడతున్నాయి.
ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల భర్తీపై, కార్పోరేషన్ల చైర్మన్ల పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల అధ్యక్షుల నియమకాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ప్రధానంగా మరో నాలుగైదు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రధాన అంశంగా తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న సమావేశం అయినందున పార్టీ ముఖ్య నాయకులకు కూడా కీలక బాధ్యతలను అప్పగించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించిన భంగపడ్డ వారికి మొదటి ప్రయారిటీ కింద వారి వారి అర్హత బట్టి ఏ పదవి కేటాయించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు సరైన విధంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వానికి అనుసంధానంగా చర్యలు తీసుకునేలా చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటి పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు గ్యారంటిలను మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ కింద వైద్య ఖర్చులను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసిన విషయం తెలిసిందే. మిగతా గ్యారంటిలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల ప్రజలకు ఏ మేరకు లాభం జరుగుతుందో లేదో తెలుసుకునేందుకు, ప్రతి ఒక్కరికి వాటి గురించి తెలిసేలా జిల్లా స్థాయిల్లో నాయకులును ఏర్పాటు చేసేందుకు చర్చించనున్నారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ముందు ఏ విధంగా పార్టీ పని చేసిందో, అలానే మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేలా నాయకుల మధ్య చర్చ జరగనుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపుగా 14 స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ పీఏసీ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ధికారంలోకి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇటు పీసీసీ అధ్యక్షుడిగా, అటు సీఎంగా రెండు బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా వ్యవహారిస్తున్నారు. తీసుకుని ముందుకు సాగుతున్నారు. సీఎంగా అన్ని వ్యవహారాలు చూస్తూనే.. పార్టీ కార్యక్రమాలను సైతం భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు.
హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ-ల ప్రభావం హైదరాబాద్ నగరంపై కనిపించలేదు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు- కూడా గెలవలేదు. నగరంలోని మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో జెండా ఎగురవేయాలని వ్యూహాలను రచిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గాల్లో.. మూడింటిని చే చిక్కించుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. నాంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన ఫిరోజ్ ఖాన్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిపై ఓడిపోయారు. అలాగే మాల్కాజ్‌గిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన మైనంపల్లి హనుమంతరావు కూడా ఓడిపోయారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి, అయితే వీరు ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్లపై ఆశ పెట్టు-కున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నామని గుర్తు చేస్తున్నారు.