Sunday, November 24, 2024

TS: బెల్లంపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి… రేవంత్ రెడ్డి

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, నవంబర్ 11 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ పార్టీ పట్టాదారుల్లో మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి (కాక) కుటుంబం ఒకటని, వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి గడ్డం వినోద్ వెంకటస్వామిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ మైదానంలో జరిగిన విజయభేరి సభలో పాల్గొని మాట్లాడారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నదిపై 38వేల 500కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో ప్రాజెక్టును ప్రారంభిస్తే దాన్ని కాదని కేసీఆర్ తన స్వార్థంతో అంచనా వ్యయాన్ని ఒక లక్ష 50 వేల కోట్లకు పెంచి, మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించారని, అది పేక మేడలా కూలిపోయిందని ఆరోపించారు. ఎందుకు కూలిపోయిందంటే ఇసుక కదిలింది అంటున్నారన్నారు. కేసీఆర్ చేసిన పని ఏ విధంగా ఉందంటే బుద్ధిమంతులందరూ కలిసి పందిరి వేస్తే పేకా పేడ తగిలి కూలిపోయిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు అనాపైసా పనికిరాకుండా పోయాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు గుప్పించారు. ఆయనకు ఖాళీ భూమి కనిపించినా, బాగున్న ఆడపిల్ల కనిపించినా కన్నేస్తారని, ఆయన చేష్టలు ఢిల్లీ దాకా పాకిపోయాయని, అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టకుండా కేసీఆర్ సిగ్గు లేకుండా తన పక్కన పెట్టుకొని మళ్ళీ అతన్ని గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. చెన్నూరులోని మరొక ఎమ్మెల్యే బాల్క సుమన్ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తనపై 100 కేసులున్నాయని, ఎదుటి వ్యక్తి గడ్డం వివేక్ కు 100 కోట్లు ఉన్నాయని పేర్కొని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యాపారం చేసి కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. బాల్క సుమన్ సంపాదన అంతా కూడా ఇసుక మాఫియా, సింగరేణి భూముల కబ్జాలతో కోట్లు సంపాదించారని, ఇలాంటి కబ్జాకోర్ల నుండి ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల పై ఉందన్నారు.

ఈ మధ్యలో కేసీఆర్ పిచ్చి లేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కర్ఫ్యూలు ఉంటాయని ఆరోపిస్తున్నారు. రైతుల ఉచిత కరెంటుకు పెటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని, 2004 సంవత్సరంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులకు 9గంటల ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు ఆరోజు ఉన్న రైతు బకాయిలు రూ.1200 కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ధరణికంటే మంచి సాధనాన్ని తీసుకువచ్చి రైతు భరోసా కింద ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు 15వేల చొప్పున ఎకౌంట్లో వేస్తామని, రైతు కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12వేలు, చేయూత పథకం కింద పెన్షన్ దారులకు రూ.4వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా 2వేల 500 రూపాయలు, పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ.5లక్షలు, రూ.5వందలకే గ్యాస్ సిలిండర్, బ్యాంకు భద్రత కింద చదువుకున్న వారికి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి చెన్నూర్, బెల్లంపల్లిలో గడ్డం వినోద్, గడ్డం వివేక్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసంగం చివరలో బహిరంగ సభకు వచ్చిన ప్రజలతో బై బై కేసీఆర్ అంటూ నినదింపజేశారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వివేక్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ రాజు, సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశేఖర్ లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement