ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో, కాచిగూడలోని 214 పోలింగ్ కేంద్రంలో టిఫిన్ బాక్స్ బైఠక్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయించలేని రాహుల్ గాంధీ.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. పథకాల అమలుపై లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీపై ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే ఓటేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మెజార్టీ సీట్లు గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను ప్రకటించడం కాదని.. ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మళ్లీ ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.