Friday, November 22, 2024

Coordination Committee – కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌న్వ‌య‌ క‌మిటీ ఏర్పాటు…జానారెడ్డికి చోటు

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నేరుగా పర్యవేక్షిస్తోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది హైకమాండ్. సభ్యులుగా మాణిక్ రావు థాక్రే , జానారెడ్డి, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లను నియమించింది. అలాగే చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకుడిగా ఎంకే విష్ణుప్రసాద్‌ను నియమించింది .

కాగా.. దూకుడు మీదున్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ముందుకు న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, వామపక్ష, కాంగ్రెస్ మధ్య సీట్ల చర్చల నేప‌థ్యంలో ఉమ్మడి ఖమ్మం, నల్డొండ జిల్లా హస్తం సీనియర్ నేతలను ఆందోళనకు గుర‌వుతున్నారు. ఖ‌మ్మం జిల్లాలో కేవలం మూడు జనరల్ స్థానాలు మినహా కాంగ్రెస్ టికెట్ల కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి ఇటీవల పార్టీలో చేరిన టికెట్ ఆశావహులతో పాటు ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహులు చాలా మంది ఉన్న తరుణంలో వామపక్షాలకు పోటీ చేయడానికి కొన్ని సీట్లు కేటాయించడం కాంగ్రెస్ కు కష్టకాలమే అని చెప్పాలి.

- Advertisement -

అయితే సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. వామపక్షాలు కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సీట్లు అడుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీలకు ఐదు, ఎస్సీలకు రెండు స్థానాలు రిజర్వు చేయడంతో పాటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో మునుగోడు, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కావాలని సీపీఐ కోరుతోంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, నల్లగొండ జిల్లా మిర్యాలగూడను సీపీఎం కోరుతోంది. ఇప్పటికే భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకపోతే వీరయ్యకు మరో సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చిక్కుముడులున్న నియోజ‌క‌వ‌ర్గాల పంచాయితీల‌ను ప‌రిష్క‌రించేందుకు, నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కుదిర్చేందుకు ఈ క‌మిటిని ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement