హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతున్న కాంగ్రెస్ పార్టీ.. మహిళా ఓట్లపై ప్రధానంగా గురి పెట్టింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా డిక్లరేషన్లు, మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రధానంగా జనాభాలో సగ భాగం ఉన్న మహిళా ఓట్లపై గురిపెట్టింది. మహిళల్లోని మెజార్టీ ఓట్లను హస్తం పార్టీ వైపు తిప్పుకుంటే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు ప్రతి ఇంటికి తీసు కెళ్లడం వల్ల.. అక్కడ అధికారం సాధ్యమైందని, మహిళలు ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంటే.. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నిర్ణయాన్ని మార్చుకోరని
చెబుతున్నారు. అందుకు ఈ నెల 17న తుక్కుగూడలో నిర్వహించే విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రకటించే ఐదు గ్యారంటీ పథకాల్లో గృహాలక్ష్మి పథకం కీలకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ గృహాలక్ష్మి పథకం కింద ప్రతి ఇంటికి రూ. 2 వేలు నగదును నేరుగా బ్యాంక్ ఖాతాలో వేయనున్నారు. ఈ గృహలక్ష్మి పథకం వల్ల పెరుగుతున్న నిత్యావసరాలు ధరలతో పాటు గ్యాస్ సిలిండర్‌కు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రూ. 2 వేల నగదు బదిలీ 57 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. 57 ఏళ్లు వయసుపై బడిన వారికి చేయూత పథకం కింద అన్ని రకాల పెన్షన్లు రూ. 4 వేలు ఇస్తామని ఖమ్మంలో నిర్వహించిన సభా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. పెన్షన్ పథకానికి అర్హత ఉన్న వారికి మినహాయించి రూ. 2 వేలు నగదు పథకం కింద మహిళలకు ఇవ్వనున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 900 ఉన్నది. గ్యాస్ సిలిండర్‌ను రూ. 500లకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నగదు బదిలీ పథకం కింద వచ్చే రూ. 2 వేలలో రూ. 400లు గ్యాస్ సిలిండర్‌కు మిగిలిన డబ్బులు నిత్యావసర వస్తువులకు వాడుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ పథకంతో నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని వివరిస్తే.. మహిళా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా పడుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే మరో నాలుగు గ్యారంటీల్లో రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు , 2 లక్షల ఉద్యోగాలు హామీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ పేరుతో ఇచ్చే ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఆకర్షించే విధంగా గ్యారంటీ పథకాలు ఉంటాయని సమాచారం. రైతు రుణమాఫీ వల్ల ప్రతి రైతు కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని భావిస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌పైన యువత, విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారని, బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక ఇబ్బందులకు గురి చేశారని చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్ పథకం అమలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల యూత్, విద్యార్థులు కాంగ్రెస్ వైపు మళ్లడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇంటి పేరుతో ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టుకునే అవకాశం ఇచ్చామని, కేసీఆర్ పాలనలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని అమలు చేయకపోవడంతో పేద వర్గాలు కోపంగా ఉన్నారని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల పథకం ప్రకటన వల్ల ఆయా వర్గాలు హస్తం పార్టీని ఆదరిస్తారని అభిప్రాయపడుతున్నారు.
పథకాల అమలుకు నిధులపై లెక్కలు..
వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో ప్రజలకిచ్చే హామీలు, పథకాల అమలకు కావాల్సిన నిధులపైన కాంగ్రెస్ పార్టీ ఆర్థికరంగం నిపుణులతో ఆధ్యయనం చేస్తున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు పెట్టిందని, మిషన్ భగీరథకు రూ. 40 వేలకు పైగా ఖర్చు చేయడంతో పాటు మిషన్ కాకతీయకు కూడా వేల కోట్లు ఖర్చు, నూతన సచివాలయంతో పాటు మిగతా వాటికి రూ. వేలాది కోట్లు వృధాగా ఖర్చు పెట్టారని గుర్తు చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన వాటికి మళ్లిd ఖర్చు చేయడానికి అవకాశం ఉండదని, ఆ డబ్బులను సంక్షేమానికి మళ్లించడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి గ్రాంట్స్ రూపంలో అన్ని శాఖలకు వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రంపై భారం పడదని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఉదహరణకు కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు ఇస్తే మిగతా రూ. 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటే పెద్దగా భారం ఉండదని చెబుతున్నారు. కేంద్రం లక్ష ఇళ్ల వరకు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పేదవాడికి సొంతింటి కల నేరవేరలేకపోయిందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్‌ను సక్రమంగా వినియోగించుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పెద్ద కష్టమేమి కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.